ప్రస్తుతం ఫామ్ లో లేక ఇబ్బంది పడుతోన్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కోసం ఓ పదిహేనేళ్ల అభిమాని రాసిన లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది క్రికెట్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇంతకీ ఆ బాలుడు ఏం రాశాడంటే? హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ప్రస్తుతం టెస్టు, వన్డేలకు సారథిగా ఉంటున్నాడు. రీసెంట్ గా జరిగిన బోర్డర్ గావస్కర్ టోర్నీలో టీమిండియా దారుణంగా విఫలమవ్వడంతో .. రోహిత్ శర్మ క్రికెట్ కు వీడ్కోలు పలికే సమయం ఆసన్నమైందని వాదనలు వినిపించాయి. ప్రస్తుతం ఫామ్ అందిపుచ్చుకోవడం కోసం రంజీల్లోనూ ఓ మ్యాచ్ ఆడిన హిట్ మ్యాన్.. ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మకు ఓ అభిమాని రాసిన లేఖ తెగ వైరల్ అవుతోంది.
"నా ఆరాధ దేవుడు, నా ఫేవరెట్ క్రికెటర్, గ్రేటెస్ట్ బ్యాటర్ ఆఫ్ ఆల్ టైమ్. లక్షల మంది అభిమానుల మనసులోని మాటను నేను మీకు తెలియజేస్తున్నాను. మీ కోసమే ఈ అందమైన క్రికెట్ ను చూస్తున్నాను. మీరు క్రికెట్ ఆడుతున్న సమయంలో నేను పుట్టినందుకు అదృష్టంగా భావిస్తున్నాను. ఫామ్ అనేది టెంపరరీ. క్లాస్ అనేది పర్మనెంట్. మీ ఈ మధ్య కాలంలో పెద్ద ఇన్నింగ్స్ లు ఆడారా లేదా అనేది పెద్ద విషయమే కాదు. మీరు రైట్ ట్రాక్ మీదే ఉన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీలో మీరు అద్భుతంగా రాణిస్తారు. రంజీలో మీరు కొట్టిన 3 సిక్సర్లు అద్భుతం. నా మ్యాథ్స్ క్లాస్ ఎగ్గొట్టి మీ మ్యాచ్ చూశాను. ఎందుకంటే అది నాకెంతో ముఖ్యం. హేటర్స్ ఎప్పుడూ హేట్ చేస్తూనే ఉంటారు. కానీ మీ నాయకత్వం ఓ అద్భుతం. ప్రతి ఫార్మాట్ లోనూ మీరు ప్లేయర్ గా, కెప్టెన్ గా సక్సెస్ అయ్యారు.
మీరు ఎంతో ఉత్తమైన ఆటగాడు. మీ కోసమే నేను ప్రతీ మ్యాచ్ చూస్తాను. ప్లీజ్ మీరూ రిటైర్ అవ్వకండి. మీరు ఓపెనింగ్ చేయడానికి మైదానంలోకి నడవకపోతే నేనెలా టీవీ ఆన్ చేయగలను. ఆ ఊహ కూడా నన్నెంతో బాధిస్తుంది. నేను 15 ఏళ్ల బాలుడిని. స్పోర్ట్స్ అనలిస్ట్ అవ్వాలనేదే నా కల. రాజస్థాన్ రాయల్స్ తో కలిసి నా ఇంటర్న్ షిప్ పూర్తి చేసాను. మీరు నాకు ఏదైనా సాయం చేయగలిగితే అది నాకు తెలియజేయండి. ఐ లవ్ యూ రోహిత్. మీరు కచ్చితంగా తిరిగి ఫామ్ లోకి వస్తారని ఆశిస్తున్నాను. " అని సదరు బాలుడు రోహిత్ పై ఉన్న ప్రేమను లేఖ రూపంలో వ్యక్తం చేశాడు.