ఆస్ట్రేలియా టూర్ లో ఘోరంగా నిరాశపరిచిన శుభ్‌మన్ గిల్.. ఎట్టకేలకు దేశవాళీ క్రికెట్ రంజీ ట్రోఫీలో సెంచరీతో మెరిశాడు. పంజాబ్ తరఫున బరిలోకి దిగిన అతడు.. కర్ణాటకతో తాజాగా జరిగిన మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో సింగిల్ డిజిట్‌కే పరిమితమైనప్పటికీ.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం శతకంతో అదరగొట్టాడు. ఈ క్రమంలో తన బ్యాటింగ్ తీరుపై స్పందించిన గిల్.. తాను ఇబ్బంది పడుతున్నట్లు పేర్కొన్నాడు. అనవసరమైన ఒత్తిడికి గురౌతున్నట్లు వెల్లడించాడు.
"ఈ ఫార్మాట్ లో నా బ్యాటింగ్ ఇబ్బందిగానే ఉంది. కొన్నిసార్లు మంచి ఆరంభాలను సాధిస్తున్నప్పటికీ వాటిని భారీ స్కోర్లుగా మలచలేక ఇబ్బంది పడాల్సి వస్తోంది. నాపై నేనే అనవసరమైన ఒత్తిడిని పెంచుకుంటున్నట్లు అర్థమవుతోంది. అందుకే, మంచి ప్రదర్శన చేయడంలో కాస్త వెనుకపడ్డాను. ఒకప్పుడు కూడా నేను ఇదే పరిస్థితుల్లో ఉన్నాను. ఆటపై సరిగ్గా దృష్టి సారించలేకపోయేవాడిని. మ్యాచ్ పరిస్థితులను అర్థం చేసుకోలేకపోయా. ఏకాగ్రత కోల్పోవడం వల్ల ఇద్దంతా జరిగింది. ఇకపై ఈ సమస్య రిపీట్ కాకుండా ఉండేందుకు పక్కా ప్లాన్ ప్రకారం ముందుకెళ్తాను" అని గిల్ అన్నాడు.
దేశవాళీలో ప్రతి క్రికెటర్ ఆడాలని బీసీసీఐ కండిషన్ పెట్టడంపై కూడా స్పందించాడు గిల్. దేశవాళీ ఆడేందుకు తాము ఎప్పుడూ సిద్ధమేనని, కానీ అదే సమయంలో విశ్రాంతి కూడా ముఖ్యమేనని అన్నాడు. "అంతర్జాతీయ సిరీస్‌కు, దేశవాళీ మ్యాచ్ కు కనీసం 15 నుంచి 20 రోజుల గ్యాప్ ఉండాలి. ఏదైనా మ్యాచ్‌కు ముందు రెస్ట్ తీసుకుంటామంటే.. అందులోనే ప్రాక్టీస్, ట్రైనింగ్ కూడా చేస్తాం అని అర్థం. ఫిజికల్ గానే కాకుండా మెంటల్ గా కూడా సిద్ధం అవ్వడానికి ఈ రెస్ట్ టైమ్ ఉపయోగపడుతుంది" అని గిల్ చెప్పుకొచ్చాడు.