టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ప్రేమల్లో పడినట్లు తెలుస్తోంది. ప్రముఖ సింగర్‌తో అతడు డేటింగ్‌లో ఉన్నట్లు క్రికెట్ వర్గాల్లో ప్రచారం జోరుగా నడుస్తోంది. తాజాగా ఆ సింగర్ బర్త్ డే వేడుకల్లోనూ సిరాజ్ ఆమెతో సన్నిహితంగా కనిపించడంతో ఆ రూమర్స్ కు మరింత బలం చేకూరింది. ఇంతకీ ఆ సింగర్ ఎవరంటే?
ప్రముఖ బాలీవుడ్ సింగర్ ఆశా భోస్లే మనవరాలు జనై భోస్లే. ఈమె కూడా సింగర్ గా కెరీర్ రాణిస్తోంది. రీసెంట్ గానే ఈమె తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ ఫొటోల్లో ఆశా భోస్లే.. సిరాజ్ కలిసి సరదాగా ఒకరి ముఖాన్ని ఇంకొకరు చూసుకుంటూ నవ్వుతూ కనిపించారు. వీరిద్దరూ చాలా సన్నిహితంగా మెలగడంతో.. మహ్మద్ సిరాజ్, జనై భోస్లే ప్రేమలో ఉన్నారంటూ సోషల్ మీడియాలో రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. పైగా ఒకరినొకరు ఇన్‌స్టాలో ఫాలో అవుతుండటం కూడా ఈ రూమర్స్ ను మరింత బలపరిచాయి.
అలానే జనై భోస్లే.. ఇన్‌స్టాగ్రామ్‌లో కేవలం గుజరాత్ టైటాన్స్ టీమ్‌ను మాత్రమే ఫాలో అవుతోంది. ఐపీఎల్ 2025 సీజన్ మెగా వేలంలో మహ్మద్ సిరాజ్‌ను గుజరాత్ టైటాన్స్. రూ.12.25 కోట్లకు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అందుకే ఇప్పుడు జనై భోస్లే.. గుజరాత్ జట్టును ఫాలో అవ్వడం కూడా ఈ జంట ప్రేమలో ఉన్నారనే వార్తలు చక్కర్లు కొట్టడానికి మరో కారణం. ఏదేమైనా సిరాజ్ - జనై ప్రేమలో ఉన్నారో లేదో స్పష్టంగా తెలీదు. ఇది తెలియాలంటే, వారు అధికారికంగా స్పందించేవరకు వేచి ఉండాల్సిందే.
జనై భోస్లే పుట్టినరోజు విషయాన్ని తెలుసుకుంటున్న నెటిజన్లు.. సోషల్ మీడియా వేదికగా ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. మరోవైపు జనై భోస్లే.. ఛత్రపతి శివాజీ మహారాజ్ చిత్రం ద్వారా నటిగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. ఇంకా ఈ పుట్టిన రోజు వేడుకల్లో మరో భారత క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ కూడా పాల్గొని సందడి చేశారు. ఈ వేడుకల్లో ఇంకా నటుడు జాకీ ష్రాఫ్, ఆశా భోస్లే, సుయాష్ ప్రభుదేశాయ్, బిగ్ బాస్ కంటెస్టెంట్ అయేషా ఖాన్ సహా తదితురులు పాల్గొన్నారు.