శ్రీలంక స్టార్ స్పినర్ వనిందు హసరంగ చరిత్ర సృష్టించాడు. టీ20ల్లో వేగంగా 300 వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. హసరంగకు ముందు ఈ రికార్డు ఆండ్రూ టై పేరిట ఉండేది. టై 211 మ్యాచ్‌ల్లో 300 వికెట్లు తీయగా.. హసరంగ కేవలం 208 మ్యాచ్‌ల్లోనే ఈ మైలురాయిని తాకాడు. టామ్ కొహ్లెర్ కాడ్‌మోర్ హసరంగకు 300వ వికెట్. టీ20ల్లో వేగంగా 300 వికెట్లు తీసిన బౌలర్లు.. హసరంగ-208 మ్యాచ్‌ల్లో ఆండ్రూ టై-211, రషీద్ ఖాన్-213, లసిత్ మలింగ-222, ముస్తాఫిజుర్ రెహ్మాన్-243, ఇమ్రాన్ తాహిర్-247 ప్రస్తుతం హసరంగ ఇంటర్నేషనల్ లీగ్ టీ20 టోర్నీలో ఆడుతున్నాడు. ఈ టోర్నీలో హసరంగ డెజర్ట్ వైపర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. శనివారం జరిగిన మ్యాచ్‌లో వైపర్స్ షార్జా వారియర్స్‌ను ఢీకొంది. ఈ మ్యాచ్‌లో వైపర్స్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది.
జేసన్ రాయ్ (38 బంతుల్లో 55; 9 ఫోర్లు) అర్ద సెంచరీతో రాణించాడు. కొహ్లెర్ కాడ్‌మోర్ 42 పరుగులు చేసి ఔటయ్యాడు.వీరిద్దరూ మినహా వారియర్స్ ఇన్నింగ్స్‌లో అంతా విఫలమయ్యారు. వైపర్స్ బౌలర్లలో ఖుజైమా తన్వీర్ 4 వికెట్లు పడగొట్టగా.. డేవిడ్ పేన్ 2, మొహమ్మద్ ఆమిర్, హసరంగ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం 152 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వైపర్స్ 14.5 ఓవర్లలోనే (2 వికెట్లు కోల్పోయి) గెలుపు తీరాలకు చేరింది. అలెక్స్ హేల్స్ (42 బంతుల్లో 77; 7 ఫోర్లు, 5 సిక్సర్లు), సామ్ కర్రన్ (34 బంతుల్లో 54; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు అర్ద శతకాలు బాది వైపర్స్‌ను గెలిపించారు. వారియర్స్ బౌలర్లలో ఆడమ్ మిల్నేకు రెండు వికెట్లు లభించాయి. ఈ గెలుపుతో వైపర్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ఈ సీజన్‌లో వైపర్స్ ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో ఆరింట విజయాలు సాధించింది.