నిక్కీ ప్రసాద్ సారథ్యంలో భారత అండర్-19 మహిళల క్రికెట్ జట్టు విజయాల పరంపర కొనసాగుతోంది. జనవరి 26, ఆదివారం సూపర్ సిక్స్ గ్రూప్-1 మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై విజయం సాధించడం ద్వారా భారత అండర్-19 మహిళల జట్టు T20 ప్రపంచ కప్ 2025 సెమీ-ఫైనల్‌కు చేరుకున్నారు. వర్షం ఆటంకం కలిగించిన ఈ మ్యాచ్‌లో భారత్ 7.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 8 వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసింది. భారత్ తరఫున వైష్ణవి శర్మ మరోసారి అద్భుత ప్రదర్శన చేసి తన నాలుగు ఓవర్లలో 15 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా.. ఇతర బౌలర్లు ఆమెకు మద్దతుగా నిలిచారు.కౌలాలంపూర్‌లోని బ్యూమాస్ ఓవల్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించిన భారత్.. టోర్నీలో అజేయంగా నిలిచింది. 65 పరుగుల లక్ష్యాన్ని కేవలం 7.1 ఓవర్లలో ఛేదించి జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచింది. బ్యాటింగ్‌లో ఓపెనర్ గొంగడి త్రిష 31 బంతుల్లో 40 పరుగులు చేసి మహిళల జట్టుకు శుభారంభం అందించింది. అంతకుముందు కమలినిని కోల్పోగా.. సానికా చాల్కే, కెప్టెన్ నిక్కీ జోడి ఎటువంటి సమస్య లేకుండా భారత్‌ను విజయతీరాలకు చేర్చింది.