క్రికెట్‌లో క్యాచెస్ విన్ మ్యాచెస్ అని అంటుంటారు. దీని అర్థం క్యాచులు పడితేనే మ్యాచులను గెలవగలం. ఒక్క క్యాచ్ చేజారినా సరే అది మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి.తాజాగా శివమ్ దూబె క్యాచ్‌ను మిస్ చేయడమే తమ కొంప ముంచిందని ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ చెప్పాడు. ఈ క్యాచ్‌ను గనుక తాము పట్టి ఉంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదన్నాడు. పూణే వేదికగా భారత్‌తో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో ఓటమి అనంతరం మాట్లాడుతూ ఇంగ్లాండ్ కెప్టెన్ బట్లర్ ఈ వ్యాఖ్యలు చేశాడు.టీమ్ఇండియా బ్యాటర్లు హార్దిక్ పాండ్యా (53), శివమ్ దూబె (53) లు హాఫ్ సెంచరీలతో రాణించడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో 79 పరుగులకే భారత్ 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. హార్దిక్ పాండ్యా, శివమ్ దూబెలు ఆరో వికెట్‌కు 87 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును ఆదుకున్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో సాకిబ్ మహమూద్ మూడు వికెట్లు, జామీ ఓవర్టన్ రెండు వికెట్లు, బ్రైడన్ కార్సే, ఆదిల్ రషీద్ చెరో వికెట్ సాధించారు.అనంతరం భారత బౌలర్లు రాణించడంతో ఇంగ్లాండ్ జట్టు లక్ష్య ఛేదనలో తడబడింది. 19.4 ఓవర్లలో 166 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్ 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో హ్యారీ బ్రూక్ (51; 26 బంతుల్లో 5 ఫోర్లు, 2సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేశాడు.
ఇక మ్యాచ్‌లో ఓడిపోవడంతో ఇంగ్లాండ్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీ20 సిరీస్‌ను కోల్పోయింది. నాలుగో టీ20 మ్యాచ్ అనంతరం ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ మాట్లాడుతూ.. ఈ మ్యాచ్‌ను తాము అద్భుతంగా ప్రారంభించామని చెప్పాడు. భారత్ ఆడుతున్నప్పుడు పవర్ ప్లేలోనే కీలక వికెట్లు పడగొట్టాము. మేము బ్యాటింగ్ చేసిన పవర్ ప్లే దూకుడిగా ఆడి పరుగులు రాబట్టినట్లుగా వివరించాడు.లక్ష్య ఛేదనలో మంచి ఆరంభం లభించింది. విజయం దిశగా సాగాం. ఈ మ్యాచ్‌ను తప్పకుండా మేము గెలవాల్సింది. అయితే.. మేం కొన్ని పొరపాట్లను చేశాం అవే మా ఓటమిని శాసించాయి అని బట్లర్ చెప్పాడు. ఈ మ్యాచ్‌బో దూబె ఆడిన తొలి బంతికే క్యాచ్ ఇచ్చాడు. దాన్ని మేము వదిలివేశాము. అతడు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తరువాత మ్యాచ్‌లో బ్యాటింగ్ సమయంలో మంచి స్థితిలో ఉన్న సమయంలో వరుసగా వికెట్లు కోల్పోయాం. అని అన్నాడు. ఈ మ్యాచ్‌లో ఓడిపోయినప్పటికి తమకు కొన్ని సానుకూల అంశాలు ఉన్నాయన్నాడు. తాము ఎలా ఆడాలని అనుకున్నామో అలాగే ఆడుతున్నామని, అయితే.. మరింత కమిట్‌మెంట్‌తో ఆడితే ఆశించిన ఫలితాలు వస్తాయని చెప్పాడు.