కేరళలో ఓ విద్యార్థి ర్యాగింగ్ భూతానికి బలికావడం పట్ల ప్రముఖ సినీ నటి సమంత ఆవేదన వ్యక్తం చేశారు. ఎర్నాకుళంలోని త్రిప్పునిథుర ప్రాంతంలో మిహిర్ అనే 15 ఏళ్ల బాలుడు ర్యాగింగ్ భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొందరు విద్యార్థులు మిహిర్ తో టాయిలెట్ నాకించారు. కమోడ్లో అతడి తలను ముంచారు. ఈ పరిణామాలతో మిహిర్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. తాము నివాసం ఉండే అపార్ట్ మెంట్ నుంచి దూకి బలవన్మరణం చెందాడు. ఈ ఘటనపై సమంత స్పందించారు.ర్యాగింగ్ ఎంత ప్రమాదకరమైనదో ఈ ఘటన ద్వారా అర్థమవుతోందని తెలిపారు. ద్వేషం, విషం నింపుకున్న కొందరి చర్యలు ఓ అమాయక బాలుడి జీవితాన్ని బలిగొన్నాయని వెల్లడించారు. దేశంలో కఠినమైన చట్టాలు ఉన్నప్పటికీ, ర్యాగింగ్ ఇబ్బందులను బయటకు చెప్పడానికి విద్యార్థులు భయపడుతున్న పరిస్థితులు నెలకొన్నాయని సమంత వ్యాఖ్యానించారు. ఒకవేళ ర్యాగింగ్ గురించి భయటికి చెబితే ఎలాంటి పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందోనని చాలామంది విద్యార్థులు తమలో తాము కుమిలిపోతున్నారని తెలిపారు. "ర్యాగింగ్ కారణంగా ఓ విద్యార్థి ప్రాణాలు తీసుకోవడం బాధాకరం. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు సంతాపం తెలుపడంతో సరిపెట్టకుండా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి. కేరళ ఘటనపై అధికారులు లోతుగా దృష్టిసారించాలి. మృతి చెందిన విద్యార్థికి న్యాయం జరగాలి. విద్యార్థులు ఇకనైనా ఇలాంటి వేధింపుల పట్ల ధైర్యంగా ముందుకు వచ్చి చెప్పాలి. ర్యాగింగ్ వంటి ఇబ్బందులు ఎదుర్కొనే వారికి అందరూ అండగా నిలవాలి" అని సమంత పిలుపునిచ్చారు.