కేంద్ర బడ్జెట్ ప్రజలను మోసం చేసే విధంగా ఉందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. గత పదేళ్లలో మధ్యతరగతి ప్రజల నుంచి నరేంద్ర మోదీ ప్రభుత్వం రూ.54.18 లక్షల కోట్ల మొత్తాన్ని పన్నుల రూపంలో వసూలు చేసిందని ఆయన ఆరోపించారు. ఇప్పుడు మాత్రం రూ.12 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇచ్చిందని తెలిపారు. అనేక పాపాలు చేసిన తర్వాత భక్తి మార్గంలో నడవాలనుకుంటున్నట్లుగా బీజేపీ తీరు ఉందని ఆయన ఎద్దేవా చేశారు.ఈరోజు ఆయన ఎక్స్ వేదికగా బడ్జెట్‌పై స్పందిస్తూ, యావత్ దేశం ద్రవ్యోల్బణం, నిరుద్యోగ సమస్యలతో బాధపడుతుంటే మోదీ ప్రభుత్వం మాత్రం కేంద్ర బడ్జెట్‌ను ప్రశంసించే పనిలో బిజీగా ఉందని విమర్శించారు. పన్ను మినహాయింపుతో సగటున ఏడాదికి రూ.80 వేలు ఆదా చేసుకోవచ్చని బీజేపీ చెబుతోందని, దేశం మొత్తం ద్రవ్యోల్బణం, నిరుద్యోగంతో పోరాడుతుంటే మోదీ ప్రభుత్వం మాత్రం ప్రశంసల కోసం తాపత్రయపడుతోందని అన్నారు.నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో యువత ప్రస్తావన లేదని, మహిళా సాధికారత లేదని, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న దిశగా చర్యలు లేవని ఆయన విమర్శించారు. ప్రైవేటు పెట్టుబడులు పెంచేందుకు ఎలాంటి చర్యలు ప్రకటించలేదని మండిపడ్డారు. ఎగుమతులు, పన్ను శ్లాబుల అంశాలను ప్రస్తావించడం ద్వారా కేంద్రం తమ వైఫల్యాలను కప్పిపుచ్చే ప్రయత్నాలు చేస్తోందని ఖర్గే అన్నారు.