రంజీ ట్రోఫీ ఏడో రౌండ్లో ఢిల్లీ, రైల్వేస్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ కూడా ఢిల్లీ తరఫున బరిలోకి దిగాడు. సరిగ్గా 12 ఏళ్ల తర్వాత కోహ్లీ రంజీ మ్యాచ్ ఆడడం గమనార్హం. అయితే రంజీల్లోనూ విరాట్ పేలవ ప్రదర్శన కొనసాగింది. ఈ మ్యాచ్‌లో కోహ్లీకి ఒక్క ఇన్నింగ్స్‌లో మాత్రమే బ్యాటింగ్ చేసే అవకాశం లభించింది. ఆ ఇన్నింగ్స్‌లోనూ కోహ్లి 6 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. రైల్వేస్ ఫాస్ట్ బౌలర్ హిమాన్షు సాంగ్వాన్ చేతిలో కోహ్లీ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. లక్షలాది అభిమానుల ముందు ది గోట్ ను క్లీన్ బౌల్డ్ చేసిన సాంగ్వాన్ ఉద్వేగానికి లోనయ్యాడు. గట్టిగా అరుస్తూ సంబరాలు చేసుకున్నాడు. ఇది కోహ్లీ అభిమానులకు కోపం తెచ్చింది. సోషల్ మీడియాలోనూ సాంగ్వాన ను ట్రోల్ చేశారు. కానీ ఇక్కడే కింగ్ కోహ్లీ అందరి మనసులు గెల్చుకున్నాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత హిమాన్షుకు ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు కోహ్లీ. ఇప్పుడు ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మ్యాచ్ తర్వాత, రైల్వేస్ పేసర్ హిమాన్షు సంగ్వాన్ విరాట్ కోహ్లీని క్లీన్ బౌల్డ్ చేసిన బంతితో ఢిల్లీ డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లాడు. ఈ సమయంలో, కోహ్లీ హిమాన్షును ‘నన్ను బౌల్డ చేసిన బంతి ఇదేనా’? అని అడిగాడు. హిమాన్షు అవును అని చెప్పగా, కోహ్లీ బాగా బౌలింగ్ చేశావని, నిన్ను చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని రైల్వేస్ బౌలర పై ప్రశంసలు కురిపించాడు. దీని తర్వాత బంతిపై ఆటోగ్రాఫ్ చేసి సంగ్వాన్ కు బహుమతిగా ఇచ్చాడు. ‘నేను మీ గురించి విన్నాను. నువ్వు మంచి బౌలర్ వి. నువ్వు భవిష్యత్ లో మరింత ముందుకెళ్లాలి’ అని సంగ్వాన్ కు అభినందనలు తెలిపాడు. ఈ వీడియో వైరల్ కావడంతో కింగ్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురుస్తోంది.