తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికపై న్యాయపోరాటం చేస్తామని వైయస్ఆర్‌సీపీ ఎంపీ గురుమూర్తి పేర్కొన్నారు. వైయస్ఆర్‌సీపీ కార్పొరేటర్లపై కూటమి నేతల దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. డిప్యూటీ మేయర్ పదవి కోసం టీడీపీ, జనసేన రాజకీయ వికృత క్రీడ మొదలుపెట్టిందని మండిపడ్డారు. ఎన్నికలో పాల్గొనేందుకు బస్సులో మా పార్టీ కార్పొరేటర్లతో కలిసి వెళ్తుండగా కూటమి నేతలు మార్గంమధ్యలో దాడి చేశారన్నారు. టీడీపీ గూండాలు బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. టీడీపీ నేత శంకర్ మరి కొందరు రౌడీలతో వచ్చి మా కార్పోరేటర్లు వెంకటేష్ తోపాటు మరో నలుగురు కార్పొరేటర్లను కొట్టి బలవంతంగా లాక్కుని వెళ్లారని చెప్పారు. పోలీసులు మాకు ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేయలేదని ఆందోళన వ్యక్తం చేశారు.
కోరం లేకపోయినా ఎన్నికల అధికారి ఎలా ఎన్నిక నిర్వహిస్తారని ప్రశ్నించారు. ఇప్పటికే మా పార్టీ డిప్యూటీ మేయర్ అభ్యర్థి శేఖర్‌రెడ్డి ఆస్తుల ధ్వంసంతో మొదలుపెట్టి.. మా పార్టీ కార్పొరేటర్లు అమర్నాథ్‌రెడ్డి, ఉమ, అజయ్‌కుమార్‌కు చెందిన ఆస్తులు ధ్వంసానికి పాల్పడ్డారని గుర్తు చేశారు. ఇంకా డిప్యూటీ మేయర్ అభ్యర్థిని బెదిరించి లొంగ దీసుకున్నారని పేర్కొన్నారు. మా దగ్గర నుంచి బలవంతంగా తీసుకెళ్లిన కార్పోరేటర్లను అప్పగించే వరకు మేం ఎన్నికలో పాల్గొనమని గురుమూర్తి స్పష్టం చేశారు.