ఎల్లుండి నుంచి ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ఇప్పటికే నాగ్‌పూర్ చేరుకున్న భారత జట్టు రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు ప్రస్తుతం ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ కోసం నాగ్‌పూర్ చేరుకుంది. అయితే, విమానాశ్రయం నుంచి హోటల్‌కి చేరుకున్న సమయంలో టీమిండియా సిబ్బంది ఒకరికి వింత అనుభవం ఎదురైంది. పోలీసులు అతనిని అభిమానిగా భావించి జట్టు బస చేస్తున్న హోటల్లోకి ప్రవేశించకుండా కొద్దిసేపు నిలిపివేశారు. ఈ ఘటనకు సంబంధించి వీడియోలో బయటకు రావడంతో నెట్టింట వైరల్‌గా మారింది. ఆటగాళ్లు, సహాయక సిబ్బంది బస్సు నుంచి దిగి హోటల్లోకి వెళ్లే క్రమంలో త్రోడౌన్ స్పెషలిస్ట్ రఘును అభిమానిగా భావించిన పోలీసులు అతనిని హోటల్ లోపలికి అనుమతించలేదు. దాంతో అతను తాను జట్టు సభ్యుడని పోలీసులను ఒప్పించడానికి ప్రయత్నించడం వీడియోలో చూడవచ్చు. కొద్దిసేపటి తర్వాత తమ తప్పు తెలుసుకున్న పోలీసులు రఘును హోటల్లోకి అనుమతించారు. కాగా, భారత క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, తదితరులు ఆదివారం రాత్రే తొలి వన్డే కోసం నాగ్‌పూర్ చేరుకున్నారు.ఎల్లుండి (గురువారం) ఇంగ్లండ్‌తో మూడు వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. రెండో వన్డే 9న కటక్, మూడో వన్డే 12న అహ్మదాబాద్‌లో జరగనున్నాయి. ఇక భారత స్పీడ్‌స్టర్ జస్ప్రీత్ బుమ్రా మొదటి రెండు వన్డేలలో బరిలోకి దిగడని, మూడో వన్డేలో అతడు ఆడే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. అతని స్థానంలో హర్షిత్ రాణాను జట్టులోకి తీసుకున్నారు. ఇక కీలకమైన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు జరుగుతున్న ఈ సిరీస్ ఇంగ్లండ్, భారత్‌కు మంచి ప్రాక్టీస్‌గా మారనుంది.