ప్రకాశం జిల్లాలో ఎండల తీవ్రత పెరిగింది. మంచు, చలి ఉధృతంగా ఉండాల్సిన సమయంలో ఉదయం నుంచే మండుతోంది. నాలుగైదు రోజులుగా జిల్లాలోని అత్యధిక ప్రాంతాల్లో 35 నుంచి 36 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అంతకు మించి నాలుగైదు డిగ్రీలు అధికంగా ఉందన్న స్థాయిలో ఎండ తీవ్రత కనిపిస్తోంది. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జిల్లా అంతటా వేడి వాతావరణమే కనిపిస్తోంది. రాత్రికి ఉక్కపోత కూడా పెరిగింది.
సాధారణంగా ఈ సమయంలో జిల్లాలో 30 నుంచి 32 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. పగటిపూట కూడా చలి వాతావరణమే ఉంటుంది. అర్ధరాత్రి నుంచి చలితో కూడిన మంచుపడుతూ ఉదయం 9 గంటల వరకూ ఆ ప్రభావం ఉంటుంది. అనంతరం కూడా ఎండ పెద్దగా ఉండదు. శివరాత్రి పండుగ వరకు ఈ తరహా వాతావరణం కొనసాగుతుంది. అనంతరం క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతుంటాయి. అయితే ఈ ఏడాది అందుకు భిన్నంగా కనిపిస్తోంది. శివరాత్రి ఇంకా 20రోజులు ఉండగా అప్పుడే ఎండల తీవ్రత పెరిగింది.