గ్రామ పంచాయతీల్లో వివిధ రకాల పన్నుల వసూళ్లు, ఇతర ఆదాయాలకు సంబంధించి అక్రమాలకు చెక్ పెట్టేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ‘స్వర్ణ పంచాయతీ’ పేరుతో కొత్తగా వెబ్‌సైట్‌ను రూపొందించి సంబంధిత పంచాయతీకి ఆన్‌లైన్‌లో పన్నుల చెల్లింపునకు శ్రీకారం చుట్టింది. పంచాయతీకి సంబంధించి అన్ని చెల్లింపులు ఆన్‌లైన్‌లో నిర్వహించేలా డిజిటలైజేషన్ చేస్తున్నది. దీంతో పంచాయతీల పాలనలో పారదర్శకత, జవాబుదారితనం పెరగనున్నది.గ్రామ పంచాయతీలకు ప్రభుత్వాలు ఇచ్చే ఆర్థిక సంఘాల నిధులు కాకుండా ఇళ్ల పన్నులే ప్రధాన ఆదాయ వనరు. వీటిని సాధారణ నిధులు అని కూడా అంటారు. ఇంకా దుకాణాల ఫీజులు, సంతల ఆశీలు, చెరువులు లీజు, సెల్ టవర్ల ఫీజు, పరిశ్రమల నుంచి ఆస్తి పన్ను వంటివి వస్తుంటాయి. పంచాయతీ సిబ్బంది ఇంతవరకు వీటిని నగదు రూపంలో నేరుగా ఆయా వ్యక్తులు, సంస్థల నుంచి వసూలు చేసేవారు. దీంతో పంచాయతీ పరిధిలో ఎంత పన్ను వసూలు కావాలి? ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి ఎంత పన్ను వసూలైంది? బకాయిలు ఎంత? అన్న సమాచారం వుండేది కాదు.
దీనిని ఆసరాగా చేసుకుని కొంతమంది సిబ్బంది అవినీతికి పాల్పడడం, పంచాయతీ నిధులను సొంత అవసరాలకు వాడుకోవడం వంటివి చేస్తుంటారు. ఈ తరహా అక్రమాలు ఆలస్యంగా వెలుగుచూడడం, సంబంధిత ఉద్యోగులపై చర్యలు తీసుకోవడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో పంచాయతీ ఆదాయ వనరుల్లో అవినీతి, అక్రమాలు, నిధుల దుర్వినియోగాన్ని అరికట్టడానికి కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రజలకు పారదర్శకంగా సమాచారం అందించేందుకు ఆన్‌లైన్ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమవుతున్నది. ఇందుగాను ‘స్వర్ణ గ్రామ పంచాయతీ’ వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. పంచాయతీల ఆదాయ, వ్యయాలకు సంబంధించిన లావాదేవీలను ‘స్వర్ణ పంచాయతీ’ పేరిట ఆన్‌లైన్ ద్వారా నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో ఏ రోజుకారోజు పంచాయతీకి ఎంత ఆదాయం వచ్చింది, ఎంత ఖర్చు అయ్యింది అన్నది తెలుస్తుంది. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఆదేశాల మేరకు నివాస గృహాలకు సంబంధించిన పన్నుల సమాచారాన్ని ఆయా కార్యదర్శులు సచివాలయాల సిబ్బంది సంబంధిత వెబ్‌సైట్‌లో నమోదు చేస్తున్నారు.
‘స్వర్ణ పంచాయతీ’ వెబ్‌సైట్‌లో ఇల్లు/ షాపు/ కంపెనీ/ పరిశ్రమ విస్తీర్ణం, హద్దులు, యాజమాని వివరాలు, ఏడాదికి ఎంత పన్ను చెల్లిస్తున్నారు వంటి వివరాలను నమోదు చేస్తారు. ఈ ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేసి డిజిటల్ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరం నుంచి గ్రామపంచాయతీల్లో డిజిటల్ సేవలు అందుబాటులోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు. పన్నుల చెల్లింపుతోపాటు పంచాయతీ ద్వారా జారీ అయ్యే వివిధ రకాల ధ్రువపత్రాలు, భవన నిర్మాణ అనుమతులు కూడా పొందవచ్చు.