గజపతినగరం ఆస్పత్రిలో మంగళవారం సాయంత్రం అమానుషమైన సంఘటన చోటు చేసుకుంది. నిండు గర్భిణీని ఆస్పత్రిలో చేర్చుకోని పక్షంలో గత్యంతరంలేక విజయనగరం ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో ఆమె 108 వాహనంలోనే పండంటి బిడ్డను ప్రసవించింది. ప్రస్తుతం ఘోషా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితుల వివరాల మేరకు.. కూనేరు పంచాయతీ మిర్తివలస గ్రామానికి చెందిన పాడి గౌరమ్మకు మంగళవారం పురిటినొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు కొంత దూరం ఆమెను డోలీలో తరలించారు. అక్కడ నుంచి 108 వాహనం ద్వారా గజపతినగరం ప్రభుత్వ ఆసుపత్రికి సాయంత్రం 5 గంటల సమయంలో తీసుకువెళ్లారు. అయితే ఆమెను చేర్చుకునేందుకు ఆసుపత్రి సిబ్బంది నిరాకరించారు.
నాలుగు గంటల దాటాక వైద్యులు ఆస్పత్రిలో అందుబాటులో ఉండరని మీకు తెలియదా? ఎందుకు ఇప్పుడు తీసుకొచ్చారని 108 వాహనం సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. గర్భిణికి ఇది రెండో కాన్పు అని, మొదటి కాన్పుకు సిజేరియన్ చేశారని, గర్భిణి పరిస్థితి విషమంగా ఉందని చెప్పినా ఆసుపత్రి సిబ్బంది చేర్చుకోమని తెగేసి చెప్పారు. దాంతో 108 సిబ్బంది ఆమెను విజయనగరం ఘోషా ఆసుపత్రికి తరలిస్తుండగా విజయనగరం సమీపంలోని ఆర్కేటౌన్ షిప్ వద్ద గౌరమ్మ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం తల్లీబిడ్డను 108 వాహనం సిబ్బంది ఘోషా ఆస్పత్రిలో చేర్చారు. తల్లీబిడ్డను కాపాడిన 108 సిబ్బంది గౌరినాయుడు, శివను పలువురు అభినందించారు.