నర్సీపట్నం డీసీసీబీ బ్యాంకులోకి ఓ వ్యక్తి పెట్రోల్ క్యాన్లతో వచ్చి హల్ చల్ చేశాడు. మూడు ప్లాస్టిక్ క్యాన్లలో 30 లీటర్ల పెట్రోల్ తీసుకువచ్చాడు. బ్యాంకుతోపాటు, బ్యాంక్ సిబ్బందిపై పెట్రోలు పోసి దాడి చేసేందుకు యత్నించాడు. బ్యాంకు నుంచి సిబ్బంది బయటకు పారిపోకుండా తాళాలు వేశాడు. దీంతో అప్రమత్తమైన బ్యాంకు సిబ్బంది.. ఆ వ్యక్తి చేతిలో ఉన్న పెట్రోల్ క్యాన్లను బలవంతంగా లాక్కున్నారు. అప్పటికే ఒక పెట్రోల్ క్యాన్‌లో ఉన్న పది లీటర్ల పెట్రోల్‌ను ఆఫీసులో పోశాడు.ఈ క్రమంలో బ్యాంక్ సీఈవో వర్మ జిల్లా ఎస్పీ, కలెక్టర్లకు ఫిర్యాదు చేశారు. పెట్రోల్ తీసుకువచ్చిన వ్యక్తి రోలుగుంట మండలం, జానకిరాంపురం సొసైటీ సీఈవో రామకృష్ణగా గుర్తించారు. రైతుల సొమ్ము దుర్వినియోగం చేశాడని ఆరోపణలపై బ్యాంక్ సిబ్బంది దర్యాప్తు చేపట్టింది. దీనిపై కోపంతోనే అతను పెట్రోల్ దాడికి యత్నించాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రంగప్రవేశం చేసిన పోలీసులు రామకృష్ణ తో పాటు వెంట వచ్చిన నలుగురులో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.