రాబోయే మూడేళ్లలో ప్రతి జిల్లాలో క్యాన్సర్ డే కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని కేంద్రప్రభుత్వం ప్రణాళిక వేస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. తిరుపతిలో మంగళవారం ఆయన బీజేపీ జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్, నవీన్‌కుమార్‌రెడ్డి, కోలా ఆనంద్ తదితర నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో క్యాన్సర్ ద్వారా 9.93 శాతం మరణాలు సంభవిస్తున్నట్లు చెప్పారు. దీనిపై అవగాహన లేకపోవడం, ముందస్తు పరీక్షలు నిర్వహించి చికిత్స అందించకపోవడంతో ఈ పరిస్థితి వచ్చిందన్నారు. క్యాన్సర్ నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయన్నారు. 1500 బృందాలతో పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇప్పటికి 71 లక్షలమందికి క్యాన్సర్ పరీక్షలు నిర్వహించగా 66 వేలమంది అనుమానితులుగా తేలారన్నారు. వీరిని ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్స్‌గా పరిగణిస్తున్న బోధనాస్పత్రులకు రెఫర్‌చేసి, మరోసారి పరీక్షలు నిర్వహించి క్యాన్సర్‌ను నిర్ధారిస్తామన్నారు. ఏ దశలో క్యాన్సర్ ఉందో గుర్తించి చికిత్స అందిస్తామన్నారు. 18 ఏళ్లు నిండిన మహిళలు రొమ్ము, సర్వైకల్ కాన్సర్ నిర్ధారణ పరీక్షలను చేయించుకోవాలని సూచించారు.