వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్ కలలు కనడంలో ఇబ్బంది లేదని చెప్పారు. కలలను నిజం అనుకోవడంలోనే ఇబ్బంది ఉందన్నారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ లాగా మరో 15 ఏళ్లు కలలు కంటూ జగన్ ఉంటారని విమర్శించారు. జగన్ ఆ మాత్రం కలలు కనకపోతే ఆయనకు, కేడర్‌కు నిద్ర పట్టదని ఎద్దేవా చేశారు. మనస్సుకు సర్ధి చెప్పుకోవడానికి , కేడర్‌కు నమ్మకాన్ని నింపడానికి జగన్ ప్రయాస పడుతున్నారని అన్నారు. జగన్ కలలు కల్లలుగానే మిగిలి పోతాయని విమర్శించారు. ప్రతిపక్ష హోదాపై గత శాసనసభలో ఏం చెప్పారో గుర్తుంచుకోవాలని అన్నారు. జగన్‌కు అసెంబ్లీనీ ఎదుర్కొనే ధైర్యం లేకనే ఇలా మాట్లాడుతున్నారని మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శించారు.