మహిళా సాధికారతతోనే సుస్థిర అభివృద్ధి సాధ్యమని టీడీపీది, మహిళలది అన్నాచెల్లెళ్ల బంధం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. శాసనసభలో మహిళా సాధికారతపై ఆయన మాట్లాడుతూ, టీడీపీ ఆవిర్భావం నుంచే మహిళాభ్యున్నతికి కృషి జరిగిందని, నిన్న, నేడు, రేపు ఎల్లప్పుడూ వారి అభివృద్ధికి కట్టుబడి ఉంటామని ఉద్ఘాటించారు.గతంలో ఎన్టీఆర్ మహిళలకు ఆస్తి హక్కు కల్పించారని, తాను డ్వాక్రా సంఘాలను స్థాపించి వారి ఆర్థికాభివృద్ధికి బాటలు వేశామని చంద్రబాబు గుర్తు చేశారు. రానున్న సంవత్సరంలో లక్షా 75 వేల మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.ప్రపంచం నాగరికత వైపు పయనిస్తున్నా, నేటికీ మహిళలపై వివక్ష కొనసాగడం బాధాకరమని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళాభ్యున్నతికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఆదర్శంగా నిలవాలని, రాజకీయాల్లో ప్రజలకు జవాబుదారీగా ఉండాలని సూచించారు.అమరావతి నేడు నిలబడి ఉందంటే అది మహిళలు చూపిన చొరవ వల్లే సాధ్యమైందని చంద్రబాబు అన్నారు. 29 వేల మంది రైతులు 34 వేల ఎకరాల భూమిని రాజధాని కోసం స్వచ్ఛందంగా ఇచ్చారని గుర్తు చేశారు. మూడు రాజధానుల పేరుతో గత ప్రభుత్వం మూడు ముక్కలాట ఆడిందని, అమరావతి కోసం భూములిచ్చిన రైతులను అవహేళన చేసిందని విమర్శించారు. ఐదేళ్లపాటు అమరావతి మహిళలు వీరవనితల్లా పోరాడారని, వారి ఇళ్లపై డ్రోన్‌లు ఎగరవేసి పైశాచికానందం పొందారని ధ్వజమెత్తారు.మహిళలను విద్యాపరంగా ప్రోత్సహించేందుకు ఎన్టీఆర్ 1983లో పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారని, ప్రతి కిలోమీటరుకు ప్రాథమిక పాఠశాల, ప్రతి మూడు కిలోమీటర్లకు అప్పర్ ప్రైమరీ, ప్రతి ఐదు కిలోమీటర్లకు హైస్కూల్, మండలానికి ఒక జూనియర్ కాలేజీ, ప్రతి డివిజన్‌కు ఇంజినీరింగ్ కాలేజీ, ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశామని చంద్రబాబు వివరించారు. 1995లో తాను ముఖ్యమంత్రి అయ్యాక విద్యా, ఉద్యోగాలు, రాజకీయాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు పెట్టాలని నిర్ణయించానని గుర్తు చేశారు.ఆడపిల్ల పుడితే మహాలక్ష్మిగా భావించి రూ.5 వేలు బ్యాంకులో డిపాజిట్ చేసి, 18 ఏళ్ల తర్వాత ఆ డబ్బులను కానుకగా ఇచ్చామని తెలిపారు. 8, 9, 10 తరగతి విద్యార్థినులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేశామని, ప్రతిభా భారతికి స్పీకర్‌గా అవకాశం ఇచ్చి మహిళలందరినీ గౌరవించామని అన్నారు. ప్రస్తుతం దేశ రాష్ట్రపతి, ఆర్థిక మంత్రి మహిళలేనని, తమ ప్రభుత్వంలో ముగ్గురు మహిళా మంత్రులు ఉన్నారని, 175 ఎమ్మెల్యే స్థానాల్లో 21 మంది మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారని పేర్కొన్నారు.ఎన్టీఆర్ 8 శాతంతో మొదలుపెట్టిన మహిళా రిజర్వేషన్లను తాను 33 శాతానికి చేర్చానని, ఇటీవల చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం లభించిందని చంద్రబాబు అన్నారు. రిజర్వేషన్లు అమలైతే చట్టసభకు 75 మంది మహిళా ఎమ్మెల్యేలు ఉంటారని తెలిపారు. కట్టెల పొయ్యిపై తన తల్లి పడుతున్న కష్టం చూసి దీపం పథకం తెచ్చానని, దేశంలో అత్యధికంగా 65 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామని, దీపం 2 కింద మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు.పసుపు కుంకుమ కింద ఒక్కో డ్వాక్రా మహిళకు రూ. 10 వేల చొప్పున రూ.9,689 అందించామని, స్త్రీ నిధి కింద రూ. 4,440 కోట్ల ఆర్థిక సాయం చేశామని గుర్తు చేశారు. తల్లిబిడ్డా ఎక్స్‌ప్రెస్, ఎన్టీఆర్ బేబీ కిట్స్, తల్లికి వందనం, అన్న అమృత హస్తం, బాలామృతం, బాలికలకు రక్ష, పెళ్లికానుక, గిరి గోరుముద్దలు, ఫుడ్ బాస్కెట్, మహిళలకు 11 రకాల ఉచిత వైద్య పరీక్షలు, మహిళల గౌరవాన్ని కాపాడేందుకు మరుగుదొడ్లు, సామూహిక శ్రీమంతాలు నిర్వహించామని తెలిపారు.2014-2019 మధ్య డ్వాక్రా మహిళలకు రూ. 8,500 కోట్లు రుణమాఫీ చేశామని, ఈ 9 నెలల్లో 7,338 స్వయం సహాయక సంఘాలను, 18 జిల్లా అర్బన్ సమాఖ్యలను ఏర్పాటు చేశామని చంద్రబాబు అన్నారు. 4,91,221 మంది డ్వాక్రా గ్రూపులకు రూ.4,217 కోట్ల స్త్రీ నిధి రుణాలు ఇచ్చామని, బ్యాంకు లింకేజీ ద్వారా 51 లక్షల మందికి గ్రామీణ ప్రాంతాల్లో రూ.29,486 కోట్లు, పట్టణ ప్రాంతాల్లో రూ. ఒక లక్షా 4 వేల 578 కోట్లు, మెప్నా గ్రూపులకు రూ. 13,860 కోట్లు ఇచ్చామని చెప్పారు.వచ్చే ఏడాదికి 15 వేల కోట్ల రుణాలు అందించడం లక్ష్యంగా పెట్టుకున్నామని, సెర్ప్ కింద డ్వాక్రాలో గ్రామీణ ప్రాంతాల్లో 8 లక్షల 48 వేల 497 సంఘాలు ఉండగా, వీటిలో 88 లక్షల 31 వేల 116 మంది సభ్యులు ఉన్నారని, వారంతా రూ. 33 వేల 942 కోట్లు రుణాలు తీసుకున్నారని, వచ్చే ఏడాదికి రూ. 50 వేల కోట్లు రుణాలు టార్గెట్ పెట్టుకున్నామని తెలిపారు.సఖి నివాస్ కింద 23 వర్కింగ్ ఉమెన్ హాస్టళ్లు ఏర్పాటు చేశామని, 4,500మంది అందులో నివాసం ఉంటున్నారని, పబ్లిక్ ప్లేస్‌లలో 304 బేబీ ఫీడింగ్ సెంటర్లు ఏర్పాటు చేశామని, 5 లక్షల 544 మందికి బాల సంజీవని పథకం ద్వారా లబ్ధి చేకూరుస్తున్నామని చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ల ద్వారా కుట్టు మిషన్లు, బ్యూటీ థెరపీ, నర్సింగ్, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ట్రైనింగ్ ఇస్తున్నామని చెప్పారు.63 లక్షల 36 వేల 932 మందికి పెన్షన్లు ఇస్తుండగా, అందులో 50 శాతంపైగా మహిళలేనని తెలిపారు. 37 లక్షల 39 వేల 522 మంది మహిళలు పెన్షన్లు అందుకుంటున్నారని, ఒక్క మహిళలకే పెన్షన్ల కింద నెలకు రూ.1,543 కోట్లు ఖర్చు చేస్తున్నామని అన్నారు. లక్షా 77 వేల 523 మంది ఒంటరి మహిళలకు పెన్షన్లు ఇస్తున్నామని, గతంలో ఎవ్వరూ ఇలా ఇవ్వలేదని, భర్త చనిపోతే వితంతు పెన్షన్ అందేది కాదని, ఒంటరి మహిళలకు అండగా నిలబడాలనే ఉద్దేశంతో వితంతు పెన్షన్లు ప్రవేశపెట్టామని తెలిపారు.మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారుచేసేందుకు 24 సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నామని, వ్యవసాయ, వ్యవసాయేతర ఉత్పత్తులపై డ్వాక్రా మహిళలకు శిక్షణ ఇవ్వడానికి ఒప్పందం జరిగిందని, అమూల్ వలే మహిళలు తయారుచేసే ఉత్పత్తులకు ఒక బ్రాండ్ తీసుకొచ్చి ప్రమోట్ చేస్తే అంతర్జాతీయంగా మంచి పేరు వస్తుందని చంద్రబాబు అన్నారు. మన ఆడబిడ్డలు తయారుచేసే ఉత్పత్తులు ప్రపంచంలోని అన్ని మార్కెట్లలో పెడతామని, బనానా ఫైబర్ తో బ్యాగులు, శారీస్, బొమ్మలు తయారు చేస్తున్నారని, గుర్రపు డెక్కతో కూడా బ్యాగులు తయారు చేస్తూ సంపద సృష్టిస్తున్నారని తెలిపారు.ర్యాపిడోతో ఒప్పందం చేసుకున్నామని, వెయ్యి ఎలక్ట్రిక్ వాహనాలను మహిళలే నడపనున్నారని, దీని ద్వారా మహిళలకు అదనపు ఆదాయం వస్తుందని, హోమ్ ట్రయాంగిల్ యాప్ ద్వారా మహిళలకు ఆన్ లైన్ ట్రైనింగ్ ఇప్పిస్తామని, నేషనల్ అప్రన్ షిప్ స్కీమ్ కింద 25 వేలమందికి ఎంపిక చేసి శిక్షణ ఇప్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని, అలీప్ సంస్థ విజయవాడ, అనాకపల్లి, కుప్పంలో ఇండస్ట్రియల్ పార్క్ పెట్టనున్నారని, లక్షా 50 వేల మందికి కుట్టుమిషన్లు ఇప్పిస్తున్నామని అన్నారు.చివరగా, మహిళా భద్రత, హక్కులు, గౌరవానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, మారుమూల పల్లెలో ఉండే ఆడబిడ్డ పట్టణాలకు వచ్చి గౌరవంగా ఉద్యోగం చేసుకునేలా చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
![]() |
![]() |