కాకినాడలో దారుణం జరిగింది.. కన్న కొడుకుల్ని చంపి తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది.. తీరని విషాదాన్ని నింపింది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన వానపల్లి చంద్రకిషోర్ ఓఎన్‌జీసీలో ఉద్యోగి.. కాకినాడ జిల్లా వాకలపూడిలోని ఓఎన్‌జీసీ ఆఫీస్‌లో అసిస్టెంట్ అకౌంటెంట్‌గా పని చేస్తున్నాడు. కాకినాడలోని ఓ ఫ్లాట్‌లో భార్య తనూజ, కుమారులు జోషిల్, నిఖిల్‌తో ఉంటున్నారు. శుక్రవారం రోజు హోలీ కావడంతో చంద్రకిషోర్ భార్య, పిల్లలను తీసుకుని తన ఆఫీసులో వేడుకలకు హాజరయ్యారు. అనంతరం పిల్లలకు యూనిఫాం కొలతలు తీయించడానికి టైలర్ దగ్గరకు ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్తున్నానని భార్యను అక్కడే ఉండమని చెప్పాడు.
భార్యకు పది నిమిషాల్లో వస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్లాడు. ఎంతసేపటికీ భర్త తిరిగి రాకపోవడంతో భార్య తనూజకు అనుమానం వచ్చింది. భర్తకు ఫోన్ చేసినా ఎత్తకపోవడంతో తనూజ తోటి ఉద్యోగులతో కలిసి ఇంటికి వెళ్లారు. అక్కడ ఇంటి కిటికీలోంచి చూడగా, భర్త ఫ్యాన్‌కు ఉరి వేసుకుని చనిపోయి కనిపించాడు.. వెంటనే తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూశారు. ఇద్దరు కుమారుల కాళ్లూ చేతులకు కట్లతో నిండా నీళ్లు ఉన్న బకెట్‌లలో తలలు మునిగిపోయి కనిపించాయి. భర్త, ఇద్దరు పిల్లలు చనిపోవడాన్ని చూసి భార్య అక్కడే కుప్పకూలారు. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ దొరికింది.
ఆ నోట్‌లో 'ప్రస్తుత పోటీ ప్రపంచంలో పిల్లలు పోటీ పడలేక పోతున్నారు.. వారికి భవిష్యత్తు లేదు, అందుకే ఇద్దరు పిల్లలను చంపి నేను కూడా చనిపోతున్నాను' అని చంద్రకిషోర్ రాసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు ఆ సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. తన తమ్ముడికి ఆర్థిక ఇబ్బందులేమీ లేవని.. ఆస్తులు ఉన్నాయని, ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని మృతుడి సోదరుడు అంటున్నారు. అయితే చంద్రకిషోర్ ఇద్దరు పిల్లలు సరిగా చదవడం లేదంటూ ఇటీవలే మరో స్కూల్‌కు మార్చినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.. చంద్రకిషోర్ పిల్లల్ని చంపి ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలపై ఆరా తీస్తున్నారు. పోస్ట్‌మార్టమ్ కోసం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.
![]() |
![]() |