పాకిస్థాన్‌లో మరోసారి బలూచిస్థాన్ తిరుగుబాటుదారులు మెరుపు దాడికి పాల్పడ్డారు. సైనికుల కాన్వాయ్‌పై ఆదివారం ఆత్మాహుతికి దాడికి తెగబడ్డారు. బలూచిస్థాన్‌లోని నోష్కిలో జరిగిన ఈ ఘటనలో 90 మంది వరకు చనిపోయినట్టు తెలుస్తోంది. ఆత్మాహుతి దాడిని ధ్రువీకరించిన పాకిస్థాన్ సైన్యం.. ఈ దాడిలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారని, మరో 21 మంది గాయపడ్డారని ప్రకటించింది. అయితే, ఈ దాడికి తామే పాల్పడినట్టు బలోచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) ప్రకటన చేసింది. తమ దాడిలో 90 మంది పాకిస్థాన్ సైనికులు హతమైనట్టు బీఎల్ఏ పేర్కొంది. గతవారం బీఎల్ఏ మిలిటెంట్లు రైలును హైజాక్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరచిపోకముందే పాక్ సైన్యంపై ఆత్మాహుతి దాడికి దిగడం గమనార్హం.
ఆత్మాహుతి దాడిపై పాకిస్థాన్ అధికారులు ఓ ప్రకటన విడుదల చేసింది. ‘భద్రతా బలగాలు క్వెట్టా నుంచి తఫ్తాన్‌కు వెళ్తుండగా వారి కాన్వాయ్‌పై దాడి జరిగింది.. కాన్వాయ్‌లోని ఏడు బస్సులు, రెండు కార్లను మిలిటెంట్ల లక్ష్యంగా చేసుకున్నారు.. ఓ బస్సును ఐఈడీతో ఉన్న వాహనం ఢీకొట్టింది.. ఇది ఆత్మాహుతి దాడిగా భావిస్తున్నాం.. అలాగే, రాకెట్ ప్రొపెల్లడ్ గ్రనేడ్‌తో తర్వాత దాడి చేశారు’ అని తెలిపింది.
ఆత్మాహుతి దాడిలో గాయపడిన సైనికులను హెలికాప్టర్లతో చికిత్స కోసం ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఆ ప్రాంతంలో పర్యవేక్షణ కోసం డ్రోన్లను వినియోగిస్తున్నారు. కాగా, సైనిక కాన్వాయ్‌పై దాడికి బాధ్యత వహిస్తూ బలోచ్ లిబరేషన్ ఆర్మీ ఆత్మాహుతి విభాగం ది మజీద్ బ్రిగేడ్ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘ కొద్ది గంటల కిందట నిష్కోలోని ఆర్సీడీ హైవేపై ఉన్న రఖ్షాన్ మిల్ సమీపంలో పాకిస్థాన్ సైన్యంపై బలోచ్ లిబరేషన్ ఆర్మీ ఆత్మాహుతి విభాగం ది మజీద్ బ్రిగేడ్ ఆత్మాహుతి దాడి చేసింది.. కాన్వాయ్‌లో మొత్తం 8 బస్సులు ఉండగా.. పేలుడు తీవ్రతకు ఒకటి పూర్తిగా ధ్వంసమైంది..’’ అని బీఎల్ఏ పేర్కొంది..
‘ఈ దాడి తర్వాత బీఎల్ఏకు చెందిన మరో టీమ్ ఫతేహ్ స్వ్యాడ్ ఇంకో బస్సును చుట్టుముట్టింది.. అందులోని ఉన్న సైనికులందరూ కాల్పుల్లో హతమయ్యారు.. శత్రువులు 90 మంది హతమయ్యారు’ అని తెలిపింది. అంతేకాదు, ఆత్మాహుతి దాడికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పింది. కాగా, ఇటీవల కాలంలో బలూచిస్థాన్‌లో తిరుగుబాటుదారులతో పాకిస్థాన్ సతమతమవుతోంది. సైనికులు, ఆర్మీ యూనిట్లే లక్ష్యంగా దాడులకు పాల్పడుతున్నారు. పాక్ మౌలికవసతులను ధ్వంసం చేస్తున్నారు. తమ వనరులను పాకిస్థాన్ దోచుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమను స్వతంత్ర దేశంగా గుర్తించాలని వారు డిమాండ్ వినిపిస్తున్నారు.
![]() |
![]() |