ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తమిళనాడులో రూ.1000 కోట్ల లిక్కర్ స్కామ్ ఆరోపణలు.. ఈడీ దాడులు

national |  Suryaa Desk  | Published : Sat, Mar 15, 2025, 10:11 PM

లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన, త్రిభాషా విధానంపై కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్.. తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే ప్రభుత్వం మధ్య గత కొన్నిరోజులుగా తీవ్ర మాటల యుద్ధం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా డీఎంకే సర్కార్‌పై బీజేపీ తీవ్ర ఆరోపణలు గుప్పించింది. తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌పై బీజేపీ మద్యం కుంభకోణం ఆరోపణలు చేసింది. తమిళనాడు రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్-టాస్మాక్‌ను అడ్డం పెట్టుకుని డీఎంకే సర్కార్ రూ.1000 కోట్ల అవినీతికి పాల్పడిందని ఆరోపించింది. ఇటీవల తమిళనాడు వ్యాప్తంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్-ఈడీ నిర్వహించిన దాడుల్లో ఈ లిక్కర్ స్కామ్ వెలుగులోకి వచ్చినట్లు తెలిపింది.


ఈడీ సోదాల్లో భారీగా ఆర్థిక అవకతవకలు బయటపడ్డాయని బీజేపీ తెలిపింది. తమిళనాడు లిక్కర్ స్కామ్ బయటపడుతుందనే అనుమానంతోనే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త విద్యా విధానంలోని త్రిభాషా సూత్రాన్ని ఖండించడం, డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాలు తగ్గిపోతాయని డీఎంకే నేతలు కొత్త అంశాలను తెరపైకి తీసుకొని వచ్చారని బీజేపీ మండిపడింది. అయితే 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తమిళనాడు రాష్ట్ర బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రోజే ఎంకే స్టాలిన్ ప్రభుత్వంపై బీజేపీ ఈ లిక్కర్ స్కామ్ ఆరోపణలు చేయడం గమనార్హం.


ఇక ఈ వ్యవహారంపై బీజేపీ నేత అమిత్ మాలవియా ఎక్స్ వేదికగా స్పందించారు. ఈడీ దాడులు, లిక్కర్ స్కామ్ లాంటి అంశాల నుంచి తమిళనాడు ప్రజల దృష్టి మరల్చేందుకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ త్రిభాషా విధానం, కొత్త విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ.. వాటిపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్ఈపీ, డీలిమిటేషన్, బడ్జెట్ పత్రాల నుంచి రూపాయి గుర్తును తొలగించడం వంటి అంశాలతో లిక్కర్ స్కామ్‌ను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. ఈడీ సోదాల్లో దొరికిన పత్రాల్లో లెక్కల్లో లేని నగదు లావాదేవీలు ఉన్నాయని పేర్కొన్నారు. డిస్టిలరీ కంపెనీలు.. దాదాపు రూ.1000 కోట్లు లంచాలను కొంత మంది వ్యక్తులకు చెల్లించినట్లు తెలిసిందని అమిత్ మాలవియ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ రూ.వెయ్యి కోట్ల డబ్బు ఎవరెవరికి అందిందో సీఎం స్టాలిన్ తెలియజేయాలని డిమాండ్ చేశారు.


ఇక ఇదే లిక్కర్ స్కామ్ ఆరోపణలపై బీజేపీ ఎమ్మెల్యే శ్రీనివాసన్ కూడా తమిళనాడు స్పీకర్‌కు ఒక లేఖ రాశారు. రూల్ 55 ప్రకారం ఈడీ దర్యాప్తు, టాస్మాక్ వద్ద లభించిన అక్రమ చెల్లింపులపై తమిళనాడు ప్రభుత్వం స్పందన చెప్పాలని లేఖలో కోరారు. టెండర్లను తారుమారు చేయడం ద్వారా రూ.వెయ్యి కోట్లు చేతులు మారినట్లు ఎమ్మెల్యే శ్రీనివాసన్ ఆరోపించారు.


తమిళనాడు ఆర్థిక శాఖ మంత్రి తంగమ్ తెనరసు అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న సమయంలోనే ప్రతిపక్ష అన్నాడీఎంకే సభను అడ్డుకుంది. లిక్కర్ స్కామ్‌పై డీఎంకే ప్రభుత్వం వివరణ ఇవ్వాలని.. దానిపై సభలో చర్చ జరగాలని పట్టుబట్టింది. అందుకు స్పీకర్ ఒప్పుకోకపోవడంతో.. అన్నాడీఎంకే సభ నుంచి వాకౌట్ చేసింది. లిక్కర్ స్కామ్, ఇతర అవినీతి ఆరోపణలపై డీఎంకే ప్రభుత్వం నైతిక బాధ్యత వహించి.. ముఖ్యమంత్రి పదవికి స్టాలిన్ రాజీనామా చేయాలని ప్రతిపక్ష నేత ఎడప్పాటి పళనిస్వామి డిమాండ్ చేశారు. తమిళనాడు బడ్జెట్‌లో సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఇతర ప్రాజెక్టులకు భారీగా నిధులను కేటాయించారు. మరీ ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉద్యోగకల్పన, ఇతర మౌలిక వసతుల ప్రాజెక్టులు అందులో ఉన్నాయి.


మరోవైపు.. టాస్మాక్‌లో భారీగా అవకతవకలు జరిగాయని బీజేపీ, అన్నాడీఎంకే చేస్తున్న ఆరోపణలను తమిళనాడు ఎక్సైజ్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ ఖండించారు. టాస్మాక్‌లో అవినీతి జరిగేందుకు ఎలాంటి ఆస్కారం లేదని తేల్చి చెప్పారు. సోదాల పేరుతో ఈడీ దాడులు చేసిందని.. కానీ ఏ ఏడాదిలో ఎఫ్ఐఆర్ నమోదు చేసిందో పేర్కొనలేదని తెలిపారు. టాస్మాక్ రిక్రూట్‌మెంట్‌లో అవకతవకల పేరిట కేసు నమోదు చేసిన ఈడీ.. ఏదో చేయాలని చూసిందన్నారు. గత 4 ఏళ్లుగా బార్ల టెండర్లను ఆన్‌లైన్‌లోనే ప్రాసెస్ చేస్తున్నామని.. ఎలాంటి ఆధారాలు లేకుండా రూ.1000 కోట్ల స్కామ్ జరిగిందని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి సెంథిల్ బాలాజీ మండిపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com