నాగ్‌పూర్‌లో సోమవారం రోజు జరిగిన హింసాత్మక ఘటనలు, అల్లర్లతో తీవ్ర దుమారం రేగుతోంది. ఈ హింసను పథకం ప్రకారమే చేశారంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి బాంబ్ పేల్చారు. ముఖ్యంగా మొఘల్ చక్రవర్తి ఔరంగాజేబుపై ప్రజలు కోపం పెంచుకోవడానికి కారణం.. ఛావా సినిమానే అని తేల్చి చెప్పారు. అలాగే మహారాష్ట్ర ప్రజలంతా సహనంగా ఉండి.. రాష్ట్రంలో శాంతిని కాపాడాకని అసెంబ్లీ సాక్షిగా కోరారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.
మొఘల్ చక్రవర్తి ఔరంగాజేబు సమాధిని తొలగించాలంటూ కొందరు ప్రజలు చేస్తున్న గొడవ దేశ వ్యాప్తంగా చర్చకు కారణం అవుతుంది. నేరుగా ప్రభుత్వానికి ఔరంగజేబు సమాధి తొలగించాలంటూ హిందూ సంఘాలు లేఖ రాశాయి. దీంతో మహారాష్ట్ర సర్కారు అక్కడ భద్రతను పెంచగా.. సోమవారం సాయంత్రం కొందరు నిరసన చేపట్టారు. ఈ క్రమంలోనే హింసాత్మక ఘర్షణలు చోటు చేసుకోగా.. 30కి పైగా వాహనాలు నిప్పంటించి మరీ ధ్వంసం చేశారు. ముఖ్యంగా కొన్ని అల్లరి మూకలు పోలీసులపైకి రాళ్లు రువ్వగా.. 30 మంది తీవ్రంగా గాయపడ్డారు.
దీంతో పోలీసులు సైతం నిరసన కారులను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఆపై 60 మంది ఆందోళన కారులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే నగరంలోని అనేక ప్రాంతాల్లో సెక్షన్ 144 విధించారు. ఇదంతా ఇలా ఉండగా నాగ్‌పూర్ హింసపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అసెంబ్లీలో మాట్లాడుతూ షాకింగ్ కామెంట్లు చేశారు. నాగ్‌పూర్‌లో విశ్వహిందూ పరిషత్ మరియు బజరంగ్ దళ్ నిరసనలు చేశాయని.. ఆ తర్వాతే కొందరు నిరసన కారులు వాహనాలను తగులబెట్టారని చెప్పారు. ఇదంతా చూస్తుంటే ప్లాన్ చేసే దాడికి పాల్పడినట్లు అర్థం అవుతుందన్నారు.
శాంతి భద్రతలను తమ చేతుల్లోకి తీసుకోవడానికి ఎవరికీ అనుమతి లేదని.. పోలీసులపై దాడులను అస్సలే సహించబోమని సీఎం వెల్లడించారు. దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే ఇలాంటి దారుణం అయిన సంఘటనలను ఇంతకు ముందెన్నడూ చూడలేదని అన్నారు. ఛావా సినిమానే ప్రజల్లో.. ముఖ్యంగా మరాఠీల్లో ఔరంగాజేబుపై కోపాన్ని పెంచిదన్నారు. ఏది ఏమైనా ప్రజలంతా సహనంగా ఉండి.. రాష్ట్రంలో శాంతిని కాపాడాలని కోరారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే కూడా ఈ హింసాత్మక ఘటనను ప్రమాళిక బద్దమైన కుట్రగా అభివర్ణించారు.
![]() |
![]() |