అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా చాలా అందంగా కనిపిస్తున్నారని.. కానీ తాను మాత్రం అత్యంత దరిద్రంగా కనిపిస్తున్నానంటూ అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కామెంట్లు చేశారు. ముఖ్యంగా కొలరాడో స్టేట్ క్యాపిటల్ భవనంలో ఉన్న తన ఫొటోను చూసి ఈ విధంగా మాట్లాడారు. తన ఫొటో ఏమాత్రం బాగా లేకపోయినప్పటికీ.. ఆ రాష్ట్ర గవర్నర్ దాన్ని చట్టసభలో అలకరించడాన్ని ఏమాత్రం తట్టుకోలేకపోయారు. వెంటనే దాన్ని తొలగించాలని ఆదేశాలు కూడా జారీ చేశారు. అంతేకాకుండా సదరు గవర్నర్ కావాలనే ఇలా చేశారంటూ ఆరోపించారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.
2019లో సారా బోర్డ్‌మన్ అనే ఆర్టిస్టు డొనాల్డ్ ట్రంప్ ఫొటోను గీశారు. గతంలో ఒబామా, జార్జి డబ్ల్యూ బుష్ వంటి వాళ్ల చిత్రాలను కూడా వేశారు. అయితే ఈమె గీసిన ట్రంప్ ఫొటోను కొలరాడో స్టేట్ ర్యాడికల్ లెఫ్ట్ గవర్నర్ జారెడ్.. స్టేట్ భవనంలో అలంకరించారు. అయితే అందులో ట్రంప్ చూసేందుకు బాగాలేరు. దీంతో అనేక మంది ఆ ఫొటో బాగాలేదని చెబుతూ సోషల్ మీడియాలో పెట్టి ట్రంప్‌ను ట్యాగ్ చేశారు. ఇవన్నీ గమనించిన ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా తన ఫొటో గురించి ఎవరూ ఊహించని స్థాయిలో కామెంట్లు చేశారు.
ఎవరూ తమ చెత్త ఫొటోలు, చిత్రాలను ఇష్టపడరని డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చారు. కానీ కొలరాడో స్టేట్ క్యాపిటల్ భవనంలో మిగిలిన అధ్యక్షుల ఫొటోలతో పాటు తనది కూడా అలాంటిదే ఒకటి ఏర్పాటు చేశారని వివరించారు. అయితే తన భవిష్యత్తులో కూడా అంత చెత్త చిత్రాన్ని తాను చూడనేమో అంటూనే.. దాన్ని ఉద్దేశ పూర్వకంగానే ఏర్పాటు చేశారంటూ ఆరోపించారు. ముఖ్యంగా తన ఫొటో గీసిన ఆర్టిస్టే.. అధ్యక్షుడు ఒబామా చిత్రాన్ని గీశారాని చెప్పారు. అది చాలా అద్భుతంగా ఉందని.. అందులో ఒబామా చాలా బాగా కనిపిస్తున్నారని వివరించారు.
కానీ తన చిత్రం మాత్రం నిజంగా అత్యంత దరిద్రంగా ఉందని.. ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆర్టిస్ట్ వృద్ధురాలు కావడంతో తన ప్రతిభను కోల్పోయినట్లు ఉందని అన్నారు. అలాగే కొలరాడోలో జరిగే ఏ కార్యక్రమంలో అయినా తన ఫొటో లేకపోయినా ఫర్వాలేదని, తానేమీ అనుకోనని చెప్పారు. కానీ ఇలాంటి ఫొటో ఉండడాన్ని మాత్రం అస్సలే ఇష్టపడను అని చెప్పుకొచ్చారు. కొలరాడో నుంచి అనేక మంది ఫోన్లు చేసి ఫొటో గురించి ఫిర్యాదు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలనే ఆ రాష్ట్ర ర్యాడికల్ లెఫ్ట్ గవర్నర్ జారెడ్ తన బాగాలేని ఫొటోను అక్కడ పెట్టించారని ఆరోపించారు.
అంతటితో ఆగకుండా జారెడ్ పోలీస్‌కు క్రైమ్‌ను అదుపు చేయడం రాదని ట్రంప్ ఎద్దేవా చేశారు. ముఖ్యంగా మాదక ద్రవ్యాల ముఠాలను అదుపు చేయలేకపోతున్నారని అన్నారు. ఆ రాష్ట్ర ప్రజలందరినీ తానే కాపాడాతనని హామీ ఇచ్చారు. అలాగే వెంటనే తన ఫొటోను అక్కడి నుంచి తీసేయాలని ట్రంప్ వెల్లడించారు.
![]() |
![]() |