ఏపీ రాజధాని అమరావతిలో మంత్రి నారాయణ మంగళవారం పర్యటించారు. ఇప్పటికే పలు పనులకు టెండర్లు ప్రక్రియ పూర్తి చేశారు. నిర్మాణంలో ఉన్న కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శుల బంగ్లాలను, సీఆర్డీఏ ప్రాజెక్ట్ కార్యాలయాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. ఏ రాష్ట్రానికి అయినా రాజధాని అవసరమని, ప్రస్తుతం రాజధాని లేని రాష్ట్రం ఏపీ మాత్రమేనని అన్నారు. గత టీడీపీ హాయంలో రూ. 43 వేల కోట్లకు టెండర్లు పిలిచామని, అధికారులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఆల్ ఇండియా సర్వీస్ భవనాలు దాదాపు పూర్తయ్యాయని తెలిపారు. కానీ గత ప్రభుత్వం (జగన్ సర్కార్) ఇవేమీ పట్టించుకోలేదని మంత్రి నారాయణ విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా అనేక ఇబ్బందులు వచ్చాయన్నారు. ఐఐటీ మద్రాస్‌ను పిలిచి బిల్డింగ్ నాణ్యత పరిశీలించి, కాంట్రాక్టర్లతో చర్చించి కొన్ని సమస్యలు పరిష్కరించామన్నారు. 90 శాతం పనులు టెండర్లు పూర్తి అయ్యాయన్నారు. మొదట క్లీనింగ్‌తో పనులు మొదలు అయ్యాయన్నారు. ఇవాళ సెక్రెటరీ.. ప్రిన్సిపాల్ కార్యదర్శి బంగళాలు పరిశీలించామన్నారు. 186 బంగాళాలు మంత్రులు, జడ్జీలు, కార్యదర్శులు ప్రధాన కార్యదర్శులకు వస్తున్నాయన్నారు. గెజిటెడ్ అధికారులకు 1440,ఎన్జీవోలకు 1995 నిర్మాణాలు వస్తున్నాయని తెలిపారు. అలాగే హై కోర్ట్ 16.85 లక్షల చదరవు అడుగులు వస్తుందన్నారు. అసెంబ్లీ 250 మీటర్ల ఎత్తులో ఉంటుందని, 15 రోజుల్లో కాంట్రాక్టర్ల మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని నారాయణ తెలిపారు.
![]() |
![]() |