క్రెడిట్ కార్డు లావాదేవీలపై రివార్డు పాయింట్లు వచ్చాయంటూ సైబర్ నేరగాళ్లు ఓ వ్యక్తికి ఫోన్ చేసి రూ.5 వేలు ఆశ చూపించి రూ. లక్ష కొట్టేశారు. రివార్డు పాయింట్లను నగదుగా మార్చుకునేందుకు దుండగులు పంపిన లింక్ ను క్లిక్ చేయగానే రూ. లక్ష బదిలీ కావడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఆన్ లైన్ మోసాల్లో కొత్త తరహా మోసానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.హైదరాబాద్ కు చెందిన ఓ వ్యాపారికి ఇటీవల 8415984558 నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. తమను తాము ఇండస్ ఇండ్ బ్యాంక్ సిబ్బందిగా పరిచయం చేసుకున్న దుండగులు.. ఇటీవల సదరు వ్యాపారి జరిపిన క్రెడిట్ కార్డు లావాదేవీల వివరాలను ప్రస్తావించారు. ఆ లావాదేవీలకు సంబంధించి వ్యాపారి క్రెడిట్ కార్డుకు రూ.5 వేల విలువైన రివార్డు పాయింట్లు జమయ్యాయని చెప్పారు. వాటిని నగదులోకి మార్చుకోవడానికి లింక్ పంపిస్తున్నామని, ఆ లింక్ క్లిక్ చేసి వివరాలు అప్ లోడ్ చేస్తే 24 గంటల్లో క్రెడిట్ కార్డుకు రూ.5 వేలు జమవుతాయని తెలిపారు. ఆ తర్వాత వ్యాపారి వాట్సాప్ కు లింక్ పంపించగా.. అది పనిచేయకపోవడంతో మరో లింక్ పంపించారు. లింక్ ఓపెన్ చేసి క్రెడిట్ కార్డు వివరాలు నమోదు చేసిన తర్వాత రూ.5 వేలు రాకపోగా తన కార్డు నుంచే రూ.లక్ష బదిలీ అయినట్లు సందేశం రావడంతో వ్యాపారి ఖంగుతిన్నాడు. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఆగంతకులపై ఫిర్యాదు చేశాడు
![]() |
![]() |