కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ద్వారా లబ్ధి పొందిన అనేక మంది నుంచి డబ్బులు వెనక్కి తిరిగి తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ముఖ్యంగా ఈ పథకం ద్వారా డబ్బులు పొందిన అనేక మంది అనర్హుల నుంచి మొత్తంగా రూ.416 కోట్లు రికవరీ చేసినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. లోక్‌సభలో నేడు జరిగిన సమావేశాల్లో లిఖిత పూర్వక ప్రశ్నకు ఈయన ఈ సమాధానం ఇచ్చారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ద్వారా అర్హులైన రైతులకు డబ్బులు ఇస్తున్నారు. ముఖ్యంగా ఏడాదికి ఏడాదికి 6 వేల రూపాయలను మూడు విడతల్లో కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. నేరుగా డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేస్తూ వస్తోంది. అయితే 2019లో ప్రారంభం అయిన ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 19 విడతల్లో రూ3.68 లక్షల కోట్లను రైతుల ఖాతాల్లో జశారు. ఈ విషయాన్ని నేరుగా కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. అయితే ఈ పథకం ప్రారంభం అయిన మొదట్లో స్వీయ ధ్రువీకరణ ఆధారంగా లబ్ధిదారుల పేర్ల నమోదుకు అనుమతి ఇచ్చారు. ఇలా చేయడంతో అనేక మంది సంపన్న రైతులు కూడా డబ్బులు పొందారు.
ఈ విషయాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 15వ విడత నుంచి ఆధార్ సీడింగ్ ప్రక్రియను ప్రారంభించింది. ముఖ్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులు, ఐటీ చెల్లింపుదారులు, చట్టబద్ధ పదవుల్లో ఉన్నవారు దీని కింద లబ్ధి పొందితే వారి నుంచి డబ్బులు రికవరీ చేయాలని చెప్పింది. దేశవ్యాప్తంగా దీన్ని అమలు చేయాలని సూచించగా.. ఆధార్, ఆదాయపన్ను శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖల వద్ద ఉన్న సమాచారంతో అనర్హుల ఏరివేత కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈక్రమంలోనే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు దీనికి సంబంధించిన లిఖిత పూర్వక ప్రశ్న ఎదురైంది.
దీంతో నేడు లోక్‌సభలో ఈ ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పారు. మొత్తంగా ఇప్పటి వరకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకంలో అనర్హులైన రైతుల నుంచి రూ.416 కోట్లు రికవరీ చేసినట్లు వెల్లడించారు. అలాగే ఈ పథకం ద్వారా లబ్ధిపొందే రైతుల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని.. పీఎం కిసాన్ ఆక్‌లైన్ పోర్టల్‌లో స్వయంగా రిజిస్టర్ చేసుకోవచ్చని కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు.
![]() |
![]() |