రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు, గత తొమ్మిది నెలలుగా రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని తీవ్రంగా నష్టపరిచిందని, ఆ నష్టాన్ని అధిగమించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టర్లకు సూచించారు. సచివాలయంలో జరిగిన తొలిరోజు కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రానున్న రోజుల్లో ప్రజల కోసం, జిల్లాల కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఒక ప్రణాళికను రూపొందించుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ల పనితీరు ప్రజలపై శాశ్వతమైన ప్రభావం చూపుతుందని, వారి పనితీరును నిరంతరం సమీక్షిస్తామని అన్నారు.ప్రజా సంక్షేమం, ప్రభుత్వ కార్యక్రమాల అమలులో అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి నొక్కి చెప్పారు. సంక్షేమ పథకాలను ప్రజలకు గౌరవంగా అందించాలని, ప్రతి అధికారి 'ప్రజలే ఫస్ట్' అనే విధానంతో పనిచేయాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న 22 రకాల సేవలకు సంబంధించి ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నామని, ఈ ప్రభుత్వం తమ కోసమే పనిచేస్తోందనే నమ్మకం ప్రజల్లో కలిగించాలని అన్నారు.రాష్ట్ర అభివృద్ధికి విజన్ 2047 ఒక దిక్సూచిలాంటిదని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గం, మండలం, గ్రామ సచివాలయం వరకు ప్రణాళికలు ఉండాలని, జిల్లాలో కలెక్టర్ విజన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారని తెలిపారు. రాష్ట్రంలో రూ.55 వేల కోట్ల విలువైన జాతీయ రహదారుల పనులు జరుగుతున్నాయని, వాటిని రెండేళ్లలో పూర్తి చేయాలని, పర్యావరణ అనుమతుల కోసం కలెక్టర్లు చొరవ తీసుకోవాలని సూచించారు.
![]() |
![]() |