ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి విమర్శలు గుప్పించారు. సంపద సృష్టిస్తామని చంద్రబాబు చెప్పారని... ఈ తొమ్మిది నెలల పాలనలో ఎంత సంపద సృష్టించారో చెప్పాలని అన్నారు. వైసీపీ ప్రభుత్వ పాలనలోని పథకాలకు కూడా పాతర వేశారని మండిపడ్డారు. పీ4 పేరుతో రాష్ట్ర ప్రజలందరినీ చంద్రబాబు ఏప్రిల్ ఫూల్ చేశారని చెప్పారు. పేదలను మరింత పేదలుగా చేస్తున్నారని విమర్శించారు. మెడికల్ సీట్లను డబ్బున్నోళ్లకు ఇస్తున్నారని దుయ్యబట్టారు. వైద్య కళాశాలలు, గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్లు, పోర్టులను ప్రైవేటు పరం చేస్తున్నారని ఆరోపించారు. గత టీడీపీ ప్రభుత్వంలో 58 కార్పొరేషన్లను ప్రైవేటు పరం చేసిన ఘనత చంద్రబాబుదని చెప్పారు. పీ4 పేరుతో డబ్బులు ఉన్నవాళ్లని, బడా బాబుల్ని వేదికపై కూర్చోబెడుతున్నారని అన్నారు. గతంలో జన్మభూమి, శ్రమదానం అని ప్రచారం చేసుకున్న చంద్రబాబు... ఇప్పుడు పీ4 పేరుతో ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు.రాష్ట్రంలో రెండే రెండు బంగారు కుటుంబాలు ఉన్నాయని... ఒకటి చంద్రబాబుది, మరొకటి పవన్ కల్యాణ్ దని అంబటి దుయ్యబట్టారు. పుట్టినప్పటి నుంచి చంద్రబాబు చేసినవన్నీ తప్పులేనని అన్నారు. ఎన్టీఆర్ దగ్గర పని చేసి... ఆయన పని పూర్తి చేశారని విమర్శించారు. లోకేశ్ లాంటి అసమర్థుడిని ప్రజలపై రుద్దాలని ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. లోకేశ్ డబ్బులు వసూలు చేసి పవన్ కు ప్యాకేజ్ ఇస్తున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వానికి నూకలు చెల్లాయని... ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజు దగ్గరపడిందని చెప్పారు.
![]() |
![]() |