పాప్యులర్ హిల్ స్టేషన్ సిమ్లాలో ఆసియాలోనే అతి పొడవైన రోప్‌వే ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. మొత్తం 13.79 కిలోమీటర్ల పొడవున నిర్మించనున్న ఈ రోప్‌వే పర్యాటకానికి మరింత ఊతమిస్తుందని భావిస్తున్నారు. తారాదేవి-సిమ్లా రోప్‌వే ప్రాజెక్టు ఇప్పటికే ప్రారంభమైంది. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) మోడల్ కింద రోప్ వే అండ్ రాపిడ్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ రూ. 1,734.40 కోట్ల వ్యయంతో చేపడుతోంది. ఇది ప్రపంచంలోనే రెండో అతి పొడవైన రోప్ వే కానుంది. ఈ రోప్‌వే మాతా తారాదేవి-సంజౌలి మధ్య నడుస్తుంది. సిమ్లా, సమీప ప్రాంతాల్లోని 15 కీలక స్టేషన్లను ఇది కలుపుతుంది. ప్రతి గంటకు దాదాపు 2వేల మంది.. రెండు వైపుల నుంచి ప్రయాణించే వీలు కలుగుతుంది. ఈ రోప్‌వేలో మొత్తం 660 కేబిన్లు ఉంటాయి. ఒక్కో కేబిన్‌లో 8 నుంచి 10 మంది వరకు ప్రయాణించవచ్చు. ప్రతి రెండుమూడు నిమిషాలకు క్యాబిన్లు స్టేషన్లకు చేరుకుంటాయి. కాగా, ప్రపంచంలోనే అత్యంత పొడవైన రోప్‌వే బొలీవియాలో ఉంది. దీని పొడవు దాదాపు 32 కిలోమీటర్లు.
![]() |
![]() |