ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిప్పుతో చెలగాటం ఆడాలనుకోవద్దు.. యూనస్‌కు హసీనా వార్నింగ్

international |  Suryaa Desk  | Published : Mon, Apr 14, 2025, 11:23 PM

ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వంపై ఆ దేశ మాజీ ప్రధాని షేఖ్ హసీనా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆదివారం అవామీ లీగ్ పార్టీ కార్యక్రమంలో వర్చువల్‌గా ప్రసంగించిన హసీనా.. యూనస్‌ను ‘స్వార్థపరుడైన వడ్డీ వ్యాపారి’గా అభివర్ణించారు. దేశాన్ని విదేశీ శక్తులతో కలిసి నాశనం చేయాలనే కుట్ర చేశాడని ఆమె ఆరోపించారు. గతేడాది జులైలో బంగ్లాదేశ్‌లో హత్యకు గురైన విద్యార్థి నాయకుడు అబూ సయీద్ మరణంపై కూడా ఆమె అనుమానాలు వ్యక్తం చేశారు. గత ఆగస్టులో ప్రాణభయంతో భారత్‌కు పారిపోయిన హసీనా.. కొన్ని రోజుల కిందట తాను తిరిగి బంగ్లాదేశ్‌లో అడుగుపెడతానని ప్రకటించారు.‘నేను ప్రాణాలతో ఉండటానికి అల్లాహ్ కారణమని, మళ్లీ దేశంలో అడుగుపెట్టడానికే నన్ను బతికించారు’ అని ఆమె పేర్కొన్నారు.


బంగ్లా విముక్తి పోరాట జ్ఞాపకాలనూ తొలగిస్తున్నారని, నోబెల్ గ్రహీత ముహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం దేశ చరిత్రను మాయం చేయాలని చూస్తోందని ఆరోపించారు. ముఖ్యంగా అవామీ లీగ్‌ భాగస్వామ్యాన్ని తగ్గించేందుకు యత్నిస్తున్నారని పేర్కొన్నారు. దేశ విముక్తి పోరాట జ్ఞాపకాలను తొలగిస్తున్నారు. మేము నిర్మించిన ముక్తి కాంప్లెక్స్‌లను దహనం చేస్తున్నారు. యూనస్‌కు దీన్ని సమర్థించే ధైర్యం ఉందా?’ అని ఆమె ప్రశ్నించారు. అవామీ లీగ్ పార్టీ సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాలను హసీనా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. ‘ఇది కొనసాగనివ్వనని, యూనస్ నిప్పుతో చెలగాటం ఆడొద్దు’ అంటూ ఆమె హెచ్చరించారు.


విదేశీ కుట్ర, రాజకీయ హత్యలు


‘అతడు అప్పులిచ్చే వడ్డీ వ్యాపారి.. మూర్ఖుడైన వ్యక్తి విదేశీ కుట్రలతో అధికారం చేపట్టాడు... బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ), జమాత్-ఎ-ఇస్లామీ రాజకీయ హత్యలు చేస్తున్నాయి.. అవామీ లీగ్ నేతలను వేధిస్తున్నారు’ అని హసీనా విమర్శించారు.


గతేడాది జులై ఆందోళనల్లో అబూ సయీద్‌ అనే విద్యార్థి నాయకుడు ప్రాణాలు కోల్పోయారు. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం.. ఆయనను పోలీసులు అన్యాయంగా హత్య చేశారు. అయితే, హసీనా దీనిని ఖండించారు. ‘అతడ్ని రబ్బరు బుల్లెట్లు తాకాయన్నారు.. రాళ్ల దాడిలో తలకు బలమైన గాయం అయ్యిందిని చెప్పారు... మరి 7.62 mm బుల్లెట్టు ఎక్కడినుంచి వచ్చింది? ఎవరు ఆ రైఫిల్‌ను తెచ్చారు?’ అని ఆమె నిలదీశారు. నిజం బయటపెట్టేందుకు ప్రయత్నించిన ఓ అధికారిని యూనస్ తొలగించారని, ఇది అతడి కుట్రలో భాగమని ఆమె ఆరోపించారు.


దేశంలో పరిశ్రమలు మూతపడ్డాయని, ఆసుపత్రులు, హోటళ్లు ధ్వంసమయ్యాయని హసీనా ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో అన్నింటిని సర్వనాశనం చేస్తున్నారని మండిపడ్డారు. ‘ప్రముఖ వైద్యులను తొలగించారు.. రాజకీయ అనుచరులకు పోలీస్ వేషాలు వేయించారు.. ద్యోగులకు న్యాయం జరగడం లేదు, రైతులు బాధపడుతున్నారు.. కూలీలు పనిలేక నిరుద్యోగులు అయ్యారు" అని ఆమె వాపోయారు.


ప్రస్తుతం భారత్‌లో ఉన్న హసీనాను బంగ్లాదేశ్‌కు తిరిగి రప్పించేందుకు యూనస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీని కలిసినప్పుడు.., హసీనా చర్యలు బంగ్లాదేశ్‌ను అస్థిరత వైపు నెడుతున్నాయని యూనస్ ఫిర్యాదు చేశాడు. అయితే భారత్ ఇప్పటివరకు ఈ విషయంలో నిష్పాక్షికంగా వ్యవహరించింది. షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయినప్పటి నుంచి భారత్, బంగ్లాదేశ్ సంబంధాలు రోజు రోజుకూ క్షీణిస్తున్నాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com