టెక్ దిగ్గజం గూగుల్‌కు అమెరికా కోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల అనుమతి లేకుండా, వారి మొబైల్ డేటాను చట్టవిరుద్ధంగా సేకరించిందన్న ఆరోపణలు నిజమని తేలడంతో, కాలిఫోర్నియా జ్యూరీ గూగుల్ కంపెనీకి $314.6 మిలియన్ల సుమారు రూ. 2627 కోట్లు జరిమానా విధించింది. ఫోన్‌ను వాడకుండా పక్కన పెట్టినప్పుడు ఐడిల్ మోడ్‌లో ఉన్నప్పుడు కూడా గూగుల్ తమ సెల్యులార్ డేటాను సొంత ప్రయోజనాల కోసం వాడుకుందని వినియోగదారులు చేసిన వాదనతో జ్యూరీ ఏకీభవించింది.2019లో కాలిఫోర్నియాలోని సుమారు 1.4 కోట్ల మంది ఆండ్రాయిడ్ వినియోగదారుల తరఫున ఈ క్లాస్ యాక్షన్ దావా దాఖలైంది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా, ఫోన్లు వాడకంలో లేనప్పుడు కూడా గూగుల్ రహస్యంగా యూజర్ల సమాచారాన్ని బదిలీ చేస్తోందని పిటిషనర్లు ఆరోపించారు. టార్గెటెడ్ యాడ్స్ చూపించడం వంటి వ్యాపార అవసరాల కోసం కంపెనీ ఈ పని చేసిందని, దీనివల్ల వినియోగదారులు తమకు తెలియకుండానే మొబైల్ డేటాను నష్టపోవాల్సి వచ్చిందని వారు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వినియోగదారులపై ఇది "తప్పనిసరి, నివారించలేని భారం" అని వాదులు వాదించారు. శాన్ జోస్ కోర్టులో విచారణ జరిపిన జ్యూరీ, గూగుల్ తప్పు చేసినట్లు నిర్ధారించి ఈ సంచలన తీర్పు ఇచ్చింది.ఈ తీర్పుపై గూగుల్ స్పందించింది. తాము దీనిపై అప్పీల్‌కు వెళ్లనున్నట్లు కంపెనీ ప్రతినిధి జోస్ కాస్టనెడా తెలిపారు. "ఆండ్రాయిడ్ ఫోన్ల భద్రత, పనితీరు, విశ్వసనీయతకు కీలకమైన కొన్ని సేవలను ఈ తీర్పు తప్పుగా అర్థం చేసుకుంది," అని ఆయన అన్నారు. వినియోగదారులు తమ సేవా నిబంధనలు, ప్రైవసీ పాలసీలకు అంగీకరించారని, అందువల్ల డేటా బదిలీకి వారు పరోక్షంగా అనుమతి ఇచ్చినట్లేనని గూగుల్ వాదిస్తోంది. ఈ ప్రక్రియ వల్ల ఏ యూజర్‌కు నష్టం జరగలేదని కంపెనీ పేర్కొంది.మరోవైపు, ఈ తీర్పు తమ వాదనకు బలమైన మద్దతు ఇచ్చిందని వాదుల తరఫు న్యాయవాది గ్లెన్ సమ్మర్స్ సంతోషం వ్యక్తం చేశారు. "గూగుల్ తప్పుడు విధానాల తీవ్రతను ఈ తీర్పు ప్రతిబింబిస్తోంది" అని ఆయన అన్నారు. కేవలం కాలిఫోర్నియా రాష్ట్రానికి మాత్రమే సంబంధించిన ఈ కేసులో గూగుల్‌కు భారీ జరిమానా పడింది. మిగిలిన 49 రాష్ట్రాలలోని ఆండ్రాయిడ్ వినియోగదారులకు సంబంధించిన ఫెడరల్ కేసు విచారణ ఏప్రిల్ 2026లో ప్రారంభం కానుంది. ఆ కేసులో గూగుల్‌పై ఆరోపణలు రుజువైతే, కంపెనీ ఇంకా చాలా పెద్ద మొత్తంలో జరిమానా చెల్లించాల్సి రావచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa