ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్ ప్రభుత్వం 10 శాతం నిధులిస్తోంది.. ప్రతిపక్ష నేత

international |  Suryaa Desk  | Published : Mon, Aug 18, 2025, 08:22 PM

ఉగ్రవాదులకు పాకిస్తాన్‌ ఆశ్రయం కల్పిస్తోంది అనేది బహిరంగ రహస్యమే. అంతేకాకుండా ప్రపంచంలో ఏ మూలన ఉగ్రదాడి జరిగినా.. దానికి మూలాలు పాకిస్తాన్ ‌లోనే ఉంటాయి అనేది కూడా అందరికీ తెలిసిందే. ఇక పాకిస్తాన్ గడ్డపై పెంచి పోషిస్తున్న ఉగ్రవాదం.. ఆ దేశానికి అంతర్జాతీయంగా చెడ్డపేరు తీసుకురావడమే కాకుండా, సొంత దేశంలోనూ దాడులు, హత్యలు, మారణ హోమానికి కారణం అవుతోంది. అయినప్పటికీ పాకిస్తాన్ మాత్రం.. ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. పైగా పాకిస్తాన్‌లో ఉన్న ఉగ్రవాద సంస్థలకు.. ఆర్థిక సహాయం అందిస్తూ, వాటిని నిధులు సమకూర్చుతూ.. ఉగ్రవాదాన్ని ప్రపంచ దేశాలపైకి వదులుతోంది. ఇక ఉగ్రవాదానికి మద్దతుగా ఉన్న పాకిస్తాన్‌కు ఆర్థికంగా ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా, ప్రపంచవ్యాప్తంగా అప్పుల కోసం అడుక్కు తింటున్నా.. తన తీరును మాత్రం మార్చుకోవడం లేదు. ఇప్పటివరకు పాకిస్తాన్ బయటి నుంచి ఇలాంటి ఆరోపణలు రాగా.. తాజాగా ఆ దేశంలోని ప్రతిపక్ష నేత ఒకరు ఇప్పుడు.. ఉగ్రవాదం విషయంలో పాక్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించడం.. అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించింది.


పాకిస్తాన్‌లో ప్రతిపక్ష పార్టీ అయిన జమియత్ ఉలేమా-ఎ-ఇస్లాం-ఫజల్ చీఫ్ మౌలానా ఫజల్ ఉర్ రెహ్మాన్ చేసిన ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. తాజాగా నిర్వహించిన ఒక అఖిలపక్ష సమావేశంలో మాట్లాడిన ఫజల్.. పాకిస్తాన్ ప్రభుత్వం ప్రజల జీవితాలు, ఆస్తులను రక్షించడంలో విఫలమైందని మండిపడ్డారు. అంతేకాకుండా పాకిస్తాన్‌లో ఉగ్రవాదులకు నిధులు కేటాయించడం, మిలిటెన్సీ విపరీతంగా పెరిగిపోవడం వల్ల మరింత దారుణమైన పరిస్థితులు నెలకొంటాయని.. తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.


 కాకినాడ ఎంపీ, తుని ఎమ్మెల్యే రెండూ వదిలేశా.. చంద్రబాబు, వైఎస్, చిరంజీవి ముగ్గురూ టికెట్ ఆఫర్ చేశారు: ఆర్ నారాయణమూర్తి


ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా, బలూచిస్తాన్, సింధ్ రాష్ట్రాల్లో మిలిటెంట్ గ్రూపులు భారీగా పెరిగిపోతున్నాయని మౌలానా ఫజల్ ఆరోపించారు. దీంతో ఆ రాష్ట్రాల్లో పాలనపై ప్రభుత్వం పట్టు ఉన్నట్లు కనిపించడం లేదని పేర్కొన్నారు. మరీ ముఖ్యంగా బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పట్టు సాధిస్తోందని తెలిపారు. మిలిటెంట్ల ప్రభావం ఉన్న ప్రాంతాల్లో వ్యవస్థలు పూర్తిగా కుప్పకూలిపోయాయని.. గిరిజన ప్రాంతాలను మిలిటెంట్లు తమ ఆధీనంలోకి తీసుకున్నారని చెప్పారు. నడిరోడ్డుపై ప్రజలను నిలిపివేసి.. వారి గుర్తింపులను చెక్ చేస్తున్నారని ఫజల్ ఆరోపించారు. ప్రభుత్వ అధికారులను కిడ్నాప్ చేసి.. పగటిపూటే ప్రజలను దోచుకుంటున్నారని తెలిపారు.


పాకిస్తాన్ ప్రభుత్వం.. దేశ అభివృద్ధి నిధులలో దాదాపు 10 శాతం నిధులను ఉగ్రవాద సంస్థలకు తరలిస్తున్నారని ఫజల్ సంచలన ఆరోపణలు చేశారు. ఇలా చేయడం వల్ల ఉగ్రవాద గ్రూపులకు నిధులు అందించడం.. ఒక వ్యవస్థీకృత పద్ధతిగా మారిందని ఆరోపించారు. దీనివల్ల పాలనతోపాటు.. దేశ భద్రత కూడా తీవ్రంగా దెబ్బతింటుందని చెప్పారు. మిలిటెంట్లు కిడ్నాప్‌లు చేసి.. డబ్బులు డిమాండ్ చేయడం అనేది.. దేశ ఆర్థిక వ్యవస్థకు సమాంతరంగా మరో ఆర్థిక వ్యవస్థగా మారిపోయిందని అన్నారు.


మరోవైపు.. పాకిస్తాన్‌ను ఆర్థికంగా బలోపేతం చేసే ప్రాజెక్ట్ అని భావిస్తున్న చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (సీపెక్) మార్గాలు కూడా అంత మంచివి కాదని ఫజల్ అభిప్రాయం వ్యక్తం చేశారు. పదే పదే మిలిటెంట్ గ్రూపులు.. కాన్వాయ్‌లపై దాడులు చేస్తున్నారని.. వాణిజ్యం, సరుకు రవాణాకు ఆటంకం కలిగిస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా కార్మికులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం వల్ల ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతుందని ఆరోపించారు.


మౌలానా ఫజల్ తాజాగా చేసిన వ్యాఖ్యలు.. షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని ఫెడరల్ ప్రభుత్వానికి.. పాకిస్తాన్‌లోని ప్రావిన్షియల్ ప్రభుత్వాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను బహిర్గతం చేస్తున్నాయి. ఉగ్రవాద నెట్‌వర్క్‌లకు సహాయం చేస్తున్నారని.. ఇటీవల పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి, ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ముఖ్యమంత్రి.. పరస్పరం చేసుకున్న ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. ఇలాంటి తరుణంలో తాజాగా ఫజల్ చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్ రాజకీయాల్లో ఉన్న అంతర్గత విభేదాలను, శాంతి భద్రతల సమస్యను ప్రపంచానికి చాటి చెప్పుతున్నాయి. ప్రభుత్వ పాలన కుప్పకూలినట్లు కనిపిస్తున్న కొన్ని రాష్ట్రాల్లో పాకిస్తాన్‌లోని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం.. తమ నియంత్రణను కోల్పోతున్నట్లు ఇలాంటి పరిణామాలు బహిర్గతం చేస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa