దేశంలో మహిళల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతున్న వేళ.. తాజాగా తమిళనాడులో దురదృష్టకరమైన సంఘటన చోటు చేసుకుంది. క్రిష్ణగిరి జిల్లాలోని ప్రముఖ సంస్థ అయిన టాటా ఎలక్ట్రానిక్స్ తమ ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన మహిళల హాస్టల్ టాయిలెట్‌లో స్పై కెమెరాను కనుగొనడం తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ కేసులో నిందితురాలిగా భావిస్తున్న ఒడిశాకు చెందిన 22 ఏళ్ల మహిళా ఉద్యోగిని నీలుకుమారి గుప్తాను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నీలుకుమారి గుప్తా టాయిలెట్‌లో రహస్యంగా చిన్న కెమెరాను అమర్చి, ఇతరులు ఆ సదుపాయాన్ని ఉపయోగిస్తున్న వీడియోలను రికార్డు చేసింది.
ఈ హాస్టల్‌లోనే ఉంటున్న మహారాష్ట్రకు చెందిన మరో మహిళా ఉద్యోగికి నిందితురాలి కదలికలపై తీవ్ర అనుమానం వచ్చింది. దీంతో ఆమె వెంటనే ఈ విషయాన్ని హాస్టల్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లింది. ఇక ఆ హాస్టల్ యాజమాన్యం టాయిలెట్‌లో సెర్చ్ చేయగా.. అక్కడ ఒక చిన్న కెమెరా రహస్యంగా దాచి ఉంచినట్లు గుర్తించారు.
ఆ హాస్టల్ వాష్‌రూంలో ఒక చిన్న కెమెరాను స్వాధీనం చేసుకున్నామని.. సీనియర్ పోలీసు అధికారి వెల్లడించారు. ఆ మహిళ రికార్డ్ చేసిన ఫుటేజీని తన లవర్‌కు పంపించాలని ప్లాన్ చేసింది. ఆమె ఉద్దేశంపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. పోలీసుల దర్యాప్తులో నిందితురాలు కనీసం ఒక వీడియోను రికార్డ్ చేసినట్లు తేలింది. అయితే ఆ వీడియో ఆమె ప్రియుడికి పంపించకముందే పట్టుకున్నట్లు తెలిపారు.
ఈ ఘటన వార్త హాస్టల్ మొత్తం వ్యాపించడంతో.. మంగళవారం సాయంత్రం సుమారు 2 వేల మందికి పైగా మహిళా ఉద్యోగులు గుమిగూడి పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేశారు. నిందితురాలిపై కఠిన చర్యలు తీసుకోవాలని.. ఆందోళనల సందర్భంగా ఉద్యోగులు ప్రముఖంగా డిమాండ్ చేశారు. అంతేకాకుండా హాస్టల్‌లో మహిళల భద్రతను, గోప్యతను మరింత పెంచేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
ఈ ఘటనపై టాటా ఎలక్ట్రానిక్స్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఇక ఇప్పటికే నిందితురాలు నీలు కుమారి గుప్తాను అరెస్ట్ చేసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆమె ఉద్దేశం ఏంటి.. ఇంకా ఎంత ఫుటేజీ రికార్డ్ చేసింది.. ఈ కుట్రలో ఇంకా ఎవరైనా భాగస్వాములు అయ్యారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa