కేంద్ర ప్రభుత్వం మధ్యతరగతి గృహ కొనుగోలుదారులకు తీపి కబురు అందించింది. ఏళ్ల తరబడి నిలిచిపోయిన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను గట్టెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించబోతోంది. మధ్యలో ఆగిపోయిన గృహ నిర్మాణ ప్రాజెక్టులను పూర్తి చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది. ఇందులో భాగంగానే లక్ష మందికి సొంతింటి కలను నిజం చేసే లక్ష్యంతో.. స్వామి-2 (SWAMIH-2) (Special Window for Affordable and Mid Income Housing-2)నిధిని ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. రూ. 15,000 కోట్ల నిధితో ఈ స్వామి-2 ఫండ్‌ను త్వరలోనే కార్యరూపంలోకి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తోంది. దీని ద్వారా దాదాపు లక్ష మంది గృహ కొనుగోలుదారులకు ప్రయోజనం చేకూరనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
ఏంటీ స్వామి నిధి?
బిల్డర్ల ఆర్థిక ఇబ్బందుల వల్ల మధ్యలో ఆగిపోయిన అందుబాటు ధరల ఇళ్లు, మిడ్ ఇన్‌కమ్ హౌసింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి కేంద్రం 2019లో ఈ స్వామి నిధిని ఏర్పాటు చేసింది. స్వామి ( SWAMIH ) అంటే Special Window for Affordable and Mid Income Housing. ఇప్పటికే చేపట్టిన మొదటి విడత విజయవంతమైంది. స్వామి-1 కింద ఇప్పటివరకు 55 వేల ఇళ్ల నిర్మాణం పూర్తి అయింది. రాబోయే 3, 4 ఏళ్లలో మరో 30,000 ఇళ్లను అప్పగించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
రెండో విడతలో భాగంగా తాజా 2025-26 బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 1500 కోట్లను ప్రాథమిక మూలధనంగా కేటాయించింది. మొత్తం రూ. 15 వేల కోట్ల సమీకరణతో లక్ష ఇళ్లను పూర్తి చేయనున్నారు. బ్యాంకులో తీసుకున్న లోన్లకు ఈఎంఐలు చెల్లిస్తూ.. అపార్ట్‌మెంట్లు చేతికి రాక అద్దె ఇళ్లలో మగ్గుతున్న లక్షలాది మంది మధ్యతరగతి ప్రజలకు ఈ నిధి ఒక వరం అని భావిస్తున్నారు.
కేవలం నిధుల కొరతతో చివరి దశలో ఆగిపోయిన ప్రాజెక్టులకు ఈ ఫండ్ ద్వారా ఆర్థిక సాయం అందుతుంది. ప్రాజెక్టుపై వివాదాలు ఉన్నా, బిల్డర్ ట్రాక్ రికార్డ్ సరిగా లేకపోయినా.. ప్రాజెక్ట్ వాణిజ్యపరంగా లాభదాయకమనిపిస్తే లెండర్ ఆఫ్ లాస్ట్ రిసార్ట్‌గా (చివరి దశగా) ఈ స్వామి నిధి అండగా నిలుస్తుంది. ఈ స్వామి నిధికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) వెంచర్స్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్‌గా వ్యవహరిస్తోంది. కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి దీనికి స్పాన్సర్‌గా ఉంటారు. రెరా (RERA)లో నమోదైన ప్రాజెక్టులు మాత్రమే ఈ నిధికి అర్హత పొందుతాయి.
2019 నాటి ఒక అధ్యయనం ప్రకారం.. దేశవ్యాప్తంగా సుమారు 1500 ప్రాజెక్టుల్లో 4.58 లక్షల ఇళ్లు నిలిచిపోయాయి. వీటిని పూర్తి చేయడానికి దాదాపు రూ. 55 వేల కోట్ల నిధులు అవసరమని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రియల్ ఎస్టేట్ రంగంలో నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించి.. కొనుగోలుదారుల్లో నమ్మకాన్ని పెంచనుందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa