ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బండి తాళం లాక్కొని ట్రాఫిక్ ఎస్సై దౌర్జన్యం.. ప్రశ్నించినందుకు అసభ్యకర సైగలు

national |  Suryaa Desk  | Published : Fri, Dec 26, 2025, 09:17 PM

శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులే సామాన్య పౌరులపై రాక్షసుల్లా విరుచుకు పడుతున్నారు. బెంగళూరులోని దేవనహళ్లి ట్రాఫిక్ పోలీసుల అరాచకం ఇప్పుడు సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపిస్తోంది. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన పేరుతో ఒక బైకర్‌ను ఆపిన పోలీసులు.. అతన్ని మానసికంగా వేధించడమే కాకుండా అత్యంత అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సైతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.


నడిరోడ్డుపై తాళాలు లాక్కొని దౌర్జన్యం..


బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. దేవనహళ్లి వద్ద ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించాడంటూ తనని పోలీసులు ఆపారని చెప్పాడు. అయితే అందుకు సంబంధించిన చలాన్ కట్టడానికి బాధితుడు సిద్ధం అయ్యాడు. కానీ అక్కడే ఉన్న సబ్ ఇన్ స్పెక్టర్ (SI) శంకరప్ప ఒక్కసారిగా బైకర్ వద్దకు వచ్చి.. బైక్ తాళాలను బలవంతంగా లాక్కున్నాడు. రోడ్డు మధ్యలో వాహనాన్ని ఆపేసి, ఆ తాళాలను ఇవ్వకుండా బాధితుడిని నడి రోడ్డుపైనే అవమానించడం ప్రారంభించాడు.


దీంతో బాధితుడు సైతం ఎస్‌ఐతో వాగ్వాదానికి దిగాడు. ముఖ్యంగా పోలీసుల విధివిధానాల గురించి ప్రశ్నించాడు. తననే ప్రశ్నించడంతో.. ఎస్ఐ శంకరప్ప అహంకారంతో విరుచుకుపడ్డారు. "నిన్ను ఇక్కడి నుంచి వదలాలన్నా, ఉండాలన్నా అది నా ఇష్టం. నేను ఎంత ఫైన్ చెబితే అంత కట్టాల్సిందే" అని హెచ్చరించారు. చట్టబద్ధంగా ప్రశ్నిస్తున్న పౌరుడి పట్ల ఒక బాధ్యతాయుతమైన అధికారి ఇలా మాట్లాడటం అక్కడున్న వారిని ఆశ్చర్య పరిచింది. తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని సదరు ఎస్ఐ సామాన్యుడిని బెదిరింపులకు గురిచేశారు.


అసభ్య సైగలు.. మూడు గంటల వేధింపులు


ఎస్ఐ తీరు మరీ దారుణంగా మారింది. ఒక దశలో తన పరిధిని దాటి బాధితుడిని బూతులు తిట్టడమే కాకుండా అత్యంత అసభ్యకరమైన 'మిడిల్ ఫింగర్' చూపిస్తూ అవమానించారు. అలాగే అదనంగా రూ. 5,000 జరిమానా వేస్తామని భయపెట్టారు. దాదాపు మూడు గంటల పాటు రోడ్డు పక్కనే నిలబెట్టి నరకం చూపించారు. చివరకు పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి.. బలవంతంగా రూ. 3,000 వసూలు చేసిన తర్వాతే అతడిని వదిలి పెట్టారు.


ఈ దారుణ అనుభవం తర్వాత బాధితుడు సోషల్ మీడియా వేదికగా పోలీసు ఉన్నతాధికారులను ప్రశ్నించారు. "పోలీసుల్లో నైతికత, వృత్తి నైపుణ్యం ఎక్కడ ఉన్నాయి? అధికారాన్ని ప్రశ్నించడం నేరమా లేక పోలీసుల అహంకారమా?" అంటూ ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వీడియో చూసిన వారంతా దేవనహళ్లి ఎస్ఐ శంకరప్పపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులే.. ఇలా రౌడీల్లా ప్రవర్తిస్తే సామాన్య ప్రజలు ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. మరి బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ఈ ఘటనపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa