ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు (ఫిబ్రవరి 16) ఏపీకి బిల్ గేట్స్.. ఆ ప్రాజెక్టుపైనా ప్రధానంగా చర్చ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 15, 2026, 06:56 PM

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు, గేట్స్ ఫౌండేషన్ ఫౌండర్ ఛైర్మన్ బిల్‌ గేట్స్ రేపు ( ఫిబ్రవరి 16) ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గేట్స్ ఫౌండేషన్ పరస్పర సహకారం చేపట్టిన ప్రాజెక్టులను సమీక్షిస్తారు. అలాగే మరిన్ని అంశాలపై పరస్పర సహకారం విస్తరించుకునే విషయాలపై చర్చిస్తారు. ఏపీ పర్యటనలో భాగంగా బిల్ గేట్స్.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌లతో భేటీ కానున్నారు. ఏపీ ప్రభుత్వం గేట్స్ ఫౌండేషన్ సహకారం సంజీవని ప్రాజెక్టు చేపడుతోంది. ఈ అంశం మీద ప్రధానంగా చర్చించనున్నట్లు తెలిసింది. ఇదే సమయంలో టెక్నాలజీ ఆధారిత డయాగ్నస్టిక్ సేవలు, మెడ్ టెక్ కార్యక్రమాలపైనా చర్చించనున్నట్లు తెలిసింది.


మరోవైపు బిల్ గేట్స్ ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న రియల్ టైమ్ గవర్నెన్స్ స్టేట్ సెంటర్ కూడా సందర్శిస్తారు, పాలనలో టెక్నాలజీని ఎలా ఉపయోగిస్తున్నారనే అంశాన్ని పరిశీలిస్తారు. ఈ సందర్భంగా రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్స్ పనితీరు, డేటా డ్రైవన్ మానిటరింగ్ మెకానిజం గురించి చంద్రబాబు, ఇతర అధికారులు బిల్ గేట్స్‌కు వివరిస్తారు. అనంతరం స్వర్ణాంధ్ర విజన్ 2047 సంస్కరణపైనా చర్చిస్తారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 కింద ప్రజారోగ్యం, వ్యవసాయ రంగం, విద్యారంగంలో తీసుకువచ్చిన సంస్కరణల గురించి బిల్ గేట్స్‌కు వివరిస్తారు. అనంతరం ఉండవల్లిలోని వ్యవసాయ క్షేత్రాన్ని కూడా బిల్ గేట్స్ బృందం పరిశీలించనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా వ్యవసాయంలో డ్రోన్స్ వినియోగం, ఏఐ పరికరాల ఉపయోగాన్ని పరిశీలించనున్నట్లు తెలిసింది.


ఆరోగ్య రంగంలో విప్లవాత్మక సంస్కరణగా ఏపీ ప్రభుత్వం సంజీవని పథకాన్ని రూపొందించింది. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో సంజీవని ప్రాజెక్టు కింద గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు, మాతా శిశుసంరక్షణ, వ్యాక్సినేషన్ వంటి సేవలు అందించే ఆలోచనలో ఉన్నారు. సంజీవని ప్రాజెక్టు కింద డిజిటల్ హెల్త్ కార్డుల జారీ ఉంటుంది. ఈ డిజిటల్ హెల్త్ కార్డులలో పౌరులకు సంబంధించిన వైద్యపరీక్షలు, చికిత్సల వివరాలతో పాటుగా, డాక్టర్లు రాసిన ప్రిస్కిప్షన్లు, ల్యాబ్ నివేదికలు, వ్యాక్సినేషన్ వివరాలు నమోదవుతాయి. అలాగే రెండున్నర లక్షల వరకూ ఉచిత హెల్త్ ఇన్సూరెన్స్ కల్పిస్తారు.


ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో సంజీవని ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా పరిశీలించారు. అక్కడ సత్ఫలితాలు రావటంతో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa