ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైల్వే జనరల్ బోగీల్లోనూ ప్రతీ గంటకోసారి క్లీనింగ్

national |  Suryaa Desk  | Published : Sun, Feb 15, 2026, 08:43 PM

రైల్వే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. రైళ్లలో పరిశుభ్రత ప్రమాణాలను మెరుగుపరిచబోతున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ శనివారం ఢిల్లీలోని రైల్‌ భవన్‌లో ప్రకటించారు. ఇకపై కేవలం రిజర్వ్‌డ్‌ బోగీలే కాకుండా సామాన్యులు ప్రయాణించే జనరల్‌ బోగీల్లోనూ ప్రతి గంటకోసారి శుభ్రం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ సరికొత్త సంస్కరణల ద్వారా ప్రయాణికులకు మరింత ఆహ్లాదకరమైన ప్రయాణ అనుభవాన్ని అందించడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.


దక్షిణ మధ్య రైల్వేకు ప్రాధాన్యం..


ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని తొలి విడతలో భాగంగా దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 80 రైళ్లలో ప్రారంభించనున్నారు. ఇందులో దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 5 ముఖ్యమైన రైళ్లు కూడా ఉండటం విశేషం. ఈ ప్రయోగాత్మక ప్రాజెక్టు విజయవంతమైన ఆరు నెలల తర్వాత మరో 80 రైళ్లకు.. ఆపై మూడేళ్ల కాలపరిమితిలో దేశంలోని అన్ని రైళ్లకు ఈ సదుపాయాన్ని విస్తరించాలని రైల్వే శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది.


ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రతి రైలులో ఒక ప్రొఫెషనల్ క్లీనింగ్ టీమ్‌తో పాటు ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేస్తారు. అయితే వీరు బీగోలను క్లీన్ చేసిన తర్వాత ఫొటోలు తీసి వాటిని కంట్రోల్ రూమ్‌కు పంపుతారు. అక్కడ ఏఐ ఆధారిత సాఫ్ట్‌వేర్ ఆ ఫోటోలను విశ్లేషించి, పరిశుభ్రత నాణ్యతను రేటింగ్ చేస్తుంది. అయితే ఈ పనుల కోసం నియమించే సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు జారీ చేయనున్నారు. వీటిని పర్యవేక్షించే సూపర్‌వైజర్లకు కనీసం 12వ తరగతి లేదా ఐటీఐ (ITI) విద్యార్హత ఉండాలని నిబంధన విధించారు.


అలాగే రైళ్లలో దిండ్లు, దుప్పట్లు సరఫరాతో పాటు చిన్నపాటి మరమ్మతులు వంటి పనులు అన్నింటినీ ఇకపై ఒకే కాంట్రాక్టర్‌కు అప్పగించనున్నారు. దీనివల్ల బాధ్యతాయుతమైన సేవలు అందుతాయని ప్రభుత్వం భావిస్తోంది. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే..ఈ ఆధునిక క్లీనింగ్ సేవల కోసం ప్రయాణికులపై ఎలాంటి అదనపు చార్జీల భారం వేయడం లేదని మంత్రి స్పష్టం చేశారు. రైలు బయలుదేరినప్పటి నుంచి గమ్యస్థానం చేరేవరకు రద్దీ సమయాల్లో గంటకోసారి, సాధారణ సమయాల్లో ప్రతి గంటన్నరకోసారి బోగీలను మెరిపిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa