ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బంగ్లాదేశ్ కొత్త ప్రధాని ప్రమాణ స్వీకారానికి మోదీ డుమ్మా

national |  Suryaa Desk  | Published : Sun, Feb 15, 2026, 07:44 PM

బంగ్లాదేశ్‌లో గత కొంతకాలంగా నడుస్తున్న మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వ పాలన ముగిసింది. ఇటీవల నిర్వహించిన బంగ్లాదేశ్ ఎన్నికల్లో తారిఖ్ రెహమాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) ఘన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈనెల 17వ తేదీన బంగ్లాదేశ్ కొత్త ప్రధానమంత్రిగా తారిఖ్ రెహమాన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాలంటూ భారత్ సహా మొత్తం 13 దేశాలకు బంగ్లాదేశ్ ఆహ్వానాలు పంపించింది.


అయితే బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవానికి భారత్ తరపున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరు కావడం లేదని కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది. ప్రధాని మోదీకి బదులుగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా హాజరుకానున్నట్లు వెల్లడించింది. ఫిబ్రవరి 17వ తేదీన బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరగనున్న తారిఖ్ రెహమాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఓం బిర్లా పాల్గొంటారని ప్రకటించింది.


అయితే ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనాలని బంగ్లాదేశ్ నుంచి ఆహ్వానం అందినప్పటికీ.. ఆ రోజున (ఫిబ్రవరి 17వ తేదీ)న మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్‌తో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారని కేంద్రం వెల్లడించింది. షెడ్యూల్ ప్రకారం ఈ కార్యక్రమం ఉండటంతో ప్రధాని వెళ్లలేకపోతున్నారని తెలిపింది. అందుకే భారత్ తరపున ఓం బిర్లా హాజరవుతున్నారని స్పష్టం చేసింది. బంగ్లాదేశ్‌తో భారత్‌కు ఉన్న సంబంధాల ప్రాముఖ్యతను ఈ నిర్ణయం నొక్కి చెబుతోందని వివరించింది.


2024లో అవామీ లీగ్ పార్టీ నేతృత్వంలోని షేక్ హసీనా ప్రభుత్వం.. అంతర్గత ఘర్షణల కారణంగా పతనమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జరిగిన మొదటి జాతీయ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ భారీ విజయాన్ని నమోదు చేసింది. దీంతో బీఎన్‌పీ ఛైర్మన్ తారిఖ్ రెహమాన్ బంగ్లాదేశ్ కొత్త ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు.


మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం తారిఖ్ రెహమాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారత్‌తో పాటు మరో 12 దేశాలను ఆహ్వానించింది. అందులో చైనా, పాకిస్తాన్, సౌదీ అరేబియా, టర్కీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, మలేషియా, శ్రీలంక ఉన్నాయి. పాకిస్తాన్ నుంచి ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి.


297 పార్లమెంట్ స్థానాలు ఉన్న బంగ్లాదేశ్‌లో బీఎన్‌పీ ఏకంగా 209 స్థానాలను గెలుచుకుంది. దీంతో దాదాపు 20 ఏళ్ల తర్వాత తిరిగి అధికారంలోకి వచ్చింది. ఇక బీఎన్‌పీ మిత్రపక్షమైన జమాత్ ఏ ఇస్లామీ 68 స్థానాలు దక్కించుకుంది. మరోవైపు.. షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీని ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించారు.


ఇక బంగ్లాదేశ్ జాతీయ ఎన్నికల ఫలితాల తర్వాత తారిఖ్ రెహమాన్‌తో ప్రధాని మోదీ మాట్లాడారు. బంగ్లాదేశ్ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో తారిఖ్ రెహమాన్‌కు భారత్ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. రెండు దేశాల మధ్య శాంతి, ప్రగతి కోసం కలిసి పని చేస్తామని ఎక్స్ వేదికగా తెలిపారు. ఇక బంగ్లాదేశ్ ప్రయోజనాల ఆధారంగానే భారత్‌తో సంబంధాలు ఉంటాయని తారిఖ్ రెహమాన్ స్పష్టం చేశారు. ఏ దేశాన్నీ తాము యజమానిగా చూడటం లేదని.. పొరుగున ఉన్న భారత్, చైనా, పాకిస్తాన్‌లతో సమాన సంబంధాలను కోరుకుంటున్నామని వెల్లడించారు. రెండు దేశాల మధ్య పరస్పర గౌరవం, ఒకరి ఆందోళనల పట్ల మరొకరు సున్నితంగా వ్యవహరిస్తూ భారత్‌తో నిర్మాణాత్మక సంబంధాలను కొనసాగిస్తామని బీఎన్‌పీ తేల్చి చెప్పింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa