చంద్రునిపైకి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఆర్టెమిస్ 1 ద్వారా ప్రయోగించిన ఓరియాన్ స్పేస్‌క్రాఫ్ట్ విజయవంతంగా పని పూర్తి చేసుకుని తిరిగి రానుంది. 13 లక్షల కిలోమీటర్ల ప్రయాణం అనంతరం భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి భూమిని చేరనుంది. ఓరియాన్ ఏకంగా గంటకు పాతిక వేల మైళ్ల వేగంతో దూసుకొచ్చే క్రమంలో ఏర్పడే ఘర్షణ వల్ల ఏకంగా 2,760 డిగ్రీల వేడి కూడా పుట్టుకొస్తుంది. అంటే సూర్యునిపై ఉండే వేడిలో సగం. అంతటి వేగాన్ని, వేడిని తట్టుకుంటూ ఆర్టెమిస్ పసిఫిక్ మహాసముద్రంలో కాలిఫోర్నియాలోని శాన్ డియాగో వద్ద తీరానికి దాదాపు 50 మైళ్ల దూరంలో క్షేమంగా దిగాల్సి ఉంటుంది. ఇది పెను సవాలేనని నాసా సైంటిస్టులంటున్నారు. అందుకే వారిలో ఇప్పట్నుంచే తీవ్ర ఉత్కంఠ నెలకొంది.