ఆదివాసీలు కల్మషం ఎరుగని అమాయకవాసులు మిగతా వారికంటే వారికి సేవ, అంకితభావం ఎక్కువ. మంచి ధైర్యసాహసాలతో కష్టించి పనిచేయడమే ధ్యేయంగా జీవనాన్ని గడిపేవారు. స్వచ్ఛమైన తేనె లాంటి మనసు కలిగిన పరమ పవిత్రులు ... అడవే వాళ్ళకు తల్లి ,ఆరాధ్యదైవం వారికి ... అడివే వారికి జీవనాధారం... విభిన్నమైన జీవన సంస్కృతి కలిగిన ఆదివాసులు.. వారి సేవలను మన ప్రభుత్వాలు అనేక విధాలుగా ఉపయోగించుకుంటున్నాయి.. ఉపయోగించుకోవడంతో పాటు భృతి కల్పించాలికూడా.. కానీ వారికి నిలువెత్తు నీడ లేకుండా చేస్తుండటం శోచనీయం..
అడవిని అనేక రకాల పేర్లతో సర్వనాశనం చేస్తున్నారు .. చింతూరు ఐటిడిఎ పరిధిలో ఉన్న చింతూరు, వి.ఆర్.పురం, కూనవరం, ఎటపాక మండలాల ఆదివాసి బిడ్డలకు ఒకవైపు పోలవరం ప్రాజెక్టు కారణంగా తరతరాలనుండి జీవిస్తున్న ప్రాంతాన్ని విడిచి తరలి పోవడం మరోవైపు జిల్లాలు విభజన కారణంగా రానున్న రోజుల్లో వీరి కష్టాలు. వారి జీవనశైలికీ శాపంగా మరింత భారంగా మారనున్నాయి , ఇప్పుడిప్పుడే మారుమూల కొండ ప్రాంతాల్లో నుండి విస్త్రుత ప్రపంచం వైపు చూస్తూ మారుతున్న కాలానికి అనుగుణంగా తమ ఉనికిని చాటుకుంటూ వడి వడిగా అడుగులు విద్యారంగం వైపుగా అడుగులు కదుపుతూ ముందుకు సాగుతుండటం కొసమెరుపు.
ఆదివాసి బిడ్డలకు అంతే కాదు వీరికి దగ్గరలో ఉన్న చింతూరు ఐటీడీఏ ను రంపచోడవరం ఐటిడిఎ లో విలీనం చేస్తారని ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే ఐటీడీఏ పీవో ఆకుల వెంకటరమణ బదిలీ అయ్యారు. ఎటపాక డివిజన్ కూడా కనుమరుగుకానుంది. పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాలలో తరతరాలుగా జీవనం సాగిస్తున్న ఆదివాసుల జీవనశైలికి ప్రాజెక్ట్ రూపంలో పెను అలజడి రేగనుంది. ఒకవైపు జిల్లాల విభజనలతో ఏజెన్సీ ఆదివాసులకు ఇక్కట్లు తప్పవు. దూర భారం పెరగనుంది.
ఏజెన్సీ ప్రాంతాలలో బాక్సైట్ తవ్వకాలు బడా మైనింగ్ వ్యాపారాలు ఇటు పోలవరం పేరుతో దేశంలోనే అత్యంత విభిన్నమైన సంస్కృతి కలిగిన కోయ, కొండరెడ్డి, గోండు లాంటి ఆదివాసుల జీవనాన్ని చిన్నాభిన్నం చేస్తున్నారు. పోలవరం కట్టొచ్చు తప్పులేదు.. కానీ అదే టైంలో అమూల్యమైన ఆదివాసి జీవనాన్ని,వారి సంస్కృతీ సంప్రదాయాలను కనుమరుగు కాకుండా కాపాడే బాధ్యత మన ప్రభుత్వంపై ఉంది. తరతరాల నుండి ఆదివాసులు జీవిస్తున్న అడవి ప్రాంతాల్లో యురేనియం తవ్వకాల పేరుతో ధ్వంసానికి రెడీ అవుతున్నారు. ఇక్కడ విభిన్నమైన చెంచు వంటి ఆదివాసి జాతులు అడవిని నమ్ముకుని జీవనం సాగిస్తున్నాయి. ఇప్పటి అడుగులు సగం నాశనం కావించే పడ్డాయి.
ఇదిలా ఉంటే ఒకవైపు అమాయకమైన ఆదివాసీ గిరిజనులు నిరక్షరాస్యులవడం, కొంత నాగరిక జీవనానికి దూరంగా ఉండటంవల్ల అక్కడక్కడా జరిగే ఎన్కౌంటర్లు వారి జీవితాలను సర్వనాశనం చేస్తున్నాయి. కొన్ని ప్రాంతాలలో శ్రమ దోపిడీకి గురవుతున్నారు వారి జీవితాలకు భరోసా కరువైంది.. ఒకప్పుడు భూస్వాముల చేతుల్లో నలిగి పోయిన ఈ ఆదివాసులు .. నేడు ఈ ప్రభుత్వాల పేరుతో జరిగే ఆధునిక పోకడలకు తట్టుకోలేక నలిగి పోతున్నారు.
ఇది ఇలాగే జరుగుతూ పోతుంటే భవిష్యత్తులో ..గోండు, భత్రా, కోయ, కొండ రెడ్డి, చెంచు లాంటి విభిన్నమైన ఆదివాసి జాతులు కనుమరుగు కావడం ఖాయం... ఇకనైనా వారి జీవనశైలితో కూడిన సంస్కృతులను కాలరాసే చర్యలను పక్కనపెట్టి, విధానాల సరళిలో మార్పులు తెస్తే అందరికీ ప్రయోజనకరం.