తిరుమల చరిత్రలో ఎన్నడూలేని విధంగా శ్రీవేంకటేశ్వరస్వామి హుండీ ఆదాయం రికార్డుస్థాయిలో రూ.7.68 కోట్లు లభించింది. ఆదివారం వేకువజాము నుంచి అర్ధరాత్రి వరకు శ్రీవారిని దర్శించుకున్న భక్తులు హుండీలో సమర్పించిన కానుకలను సోమవారం లెక్కించగా ఈ ఆదాయం లభించినట్టు అధికారులు మంగళవారం ప్రకటించారు. 2018 జూలై 26న హుండీ ఆదాయం రూ.6.28 కోట్లు లభించింది. ఆ రోజు సాధారణ హుండీ ఆదాయం రూ.4.64 కోట్లతో పాటు గతంలో ఉన్న నాణేల లెక్కింపు ద్వారా వచ్చిన రూ.1.64 కోట్ల ఆదాయాన్ని కూడా జత చేయడంతో భారీ మొత్తంలో రూ.6.28 కోట్లు లభించినట్టు టీటీడీ ప్రకటించింది. ఆ తర్వాత గతేడాది జూలై 4వ తేదీన రూ.6.18కోట్లు, అక్టోబరు 23న రూ.6.30 కోట్లు లభించిన విషయం తెలిసిందే. వీటన్నిటినీ మించి రికార్డు స్థాయిలో ఆదివారం ఒక్కరోజే రూ.7,68,20,000 లభించింది. నూతన సంవత్సరం ప్రారంభం రోజు వీఐపీలు పెద్దసంఖ్యలో స్వామివారిని దర్శించుకుని అధిక మొత్తంలో కానుకలు సమర్పించడంతోనే ఇంత భారీ మొత్తంలో హుండీ ఆదాయం లభించినట్టు అధికారులు భావిస్తున్నారు.