మూడేళ్ల నుంచి తమకు జీతాలు ఇవ్వడంలేదని, తమ కుటుంబాలు ఏం తిని బతకాలని రాజమహేంద్రవరంలోని ఎస్సీ కళాశాల బాలికల హాస్టల్‌లో కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న మహిళా సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాలకు వచ్చిన సీఎం జగన్‌ను మంగళవారం కలిసి తమ ఆవేదన చెప్పుకుందామనుకున్నామని, కానీ లోపలకు వెళ్లనీయలేదని వాపోయారు. దీంతో వై.జంక్షన్ కరెంట్ ఆఫీసు ఎదురుగా రోడ్డుపై నిలబడి దారిన పోయే వారందరికీ తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఆంధ్రజ్యోతితో వారు మాట్లాడుతూ ఎంపీ, ఎమ్మెల్యేలను కలిసి తమ గోడు చెప్పుకున్నా ఫలితం లేదని, ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా తమ కష్టాలు తీరడంలేదన్నారు. తమ పట్ల ఇంత వివక్ష జరుగుతున్నా జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం చాలా బాధగా ఉందన్నారు. ఇప్పటికైనా తమకు న్యాయం చేసి జీతాల బకాయిలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.