విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో దుర్గమ్మ అంతరాలయాన్ని ఒక మహిళ తన సెల్ కెమెరా ద్వారా చిత్రీకరించి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడం సంచలనం సృష్టించింది. ఆలయం లోపలకు కెమెరాలు, సెల్‌ఫోన్లును తీసుకువెళ్లడాన్ని నిషేధించారు. భద్రత కారణాల దృష్ట్యా ఆలయం, అంతరాలయంలో చిత్రీకరణ చేయకూడదు. అయితే ఒక మహిళ అంతరాలయంలో దృశ్యాలు చిత్రీకరించడం చర్చనీయాంశంగా మారింది. అంతరాలయం వాకిలి వద్ద కూడా సెక్యూరిటీ, పోలీసులు, ఆలయ సిబ్బంది ఉంటారు. ఇంత భద్రత ఉన్నా ఆ మహిళ సెల్‌ఫోన్‌తో వీడియో తీసింది. సోషల్ మీడియాలో ఆలయ దృశ్యాలువైరల్ కావడంతో వెంటనే దుర్గగుడి ఈవో భ్రమరాంబ స్పందించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెక్యూరిటీ సిబ్బందికి నోటీసులు జారీ చేశారు. ఈవో కథనం ప్రకారం గతేడాది డిసెంబరు 22వ తేదీ ఉదయం 9.52 నిమిషాలకు శాంతకుమారి అనే మహిళ అమ్మవారి అంతరాలయాన్ని చిత్రీకరించినట్టుగా సీసీ ఫుటేజీ పరిశీలనలో తేలింది. నిబంధనలకు విరుద్ధంగా వీడియో చిత్రీకరించిన శాంతకుమారిపై కేసు నమోదుచేశారు. వంద రూపాయల టికెట్‌తో ఆమె అమ్మవారి దర్శనానికి వచ్చినట్టు అధికారులు గుర్తించారు. వంద రూపాయల రుసుం క్యూలో వెళ్లిన భక్తులు బయట నుంచే దర్శనం చేసుకోవాల్సి ఉండగా, ఆమె అంతరాలయాన్ని ఏ విధంగా సెల్‌ఫోన్‌లో చిత్రీకరించిందనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఆమెకు ఆలయ అధికారులు ఎవరైనా సహకరించారా? అనే కోణాన్నీ పరిశీలిస్తున్నారు.