ఇతరుల భావాలను గుర్తించేసామర్ధ్యం సైకాలజిస్ట్లకు అవసరమని విద్యార్థులు స్వీయ అభ్యసనం అలవరచుకోవాలని ఏయూ వీసీ ఆచార్య పి. వి. జి. డి ప్రసాద రెడ్డి సూచించారు. శుక్రవారం ఏయూసైకాలజీ విభాగంలో నిర్వహించిన నేషనల్ సెమినార్ ఆన్ రోల్ ఆఫ్ ఫోరెన్సిక్ సైకాలజిస్ట్ ఇన్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నూతన అంశాలను అభ్యసించే మనస్తత్వాన్ని కలిగి ఉండాలన్నారు. ఇతరుల భావాలను గుర్తించే సామర్ధ్యం సైకాలజిస్ట్లకు అవసరమన్నారు. సానుకూల దృక్పధంతో ఆలోచన చేయడం, పనిచేయడం ఎంతో అవసరమన్నారు. నేరాలు జరిగిన సందర్భాలలో ఇటీవల కాలంలో ఫోరెన్సిక్ సైకాలజిస్ట్ల ప్రాముఖ్యత పెరుగుతోందన్నారు. ఇటువంటి సమయంలో వీరు అందించే వివరాలు, నివేదికలు తీర్పులు వెలువరించడంతో ప్రభావం చూపుతాయనే విషయం గుర్తించాలన్నారు. ఫోరెన్సిక్ సైకాలజిస్టు, పోలీసులు, న్యాయ, కారాగారాలు, స్వచ్చంద సంస్థలు, బాధితులు, దోషులు ఇలా విభిన్న వ్యవస్థలు, వ్యక్తులతో పనిచేయాల్సిన అవసరం ఉంటుందన్నారు. దీనికి అనుగుణంగా తమ సామర్ధ్యాలు, నైపుణ్యాలు పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
విశిష్ట అతిధి సీబీఐ, ఏసీబీ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ ఆర్. మురళి మాట్లాడుతూ ఫోరన్సిక్ సైకాలజిస్ట్లు చట్టాలపైన అవగాహన కలిగి ఉండాలని సూచించారు. నేరగాళ్ల మనస్సును చదివే ప్రయత్నం చేయాల్సి ఉంటుందన్నారు. విచారణ ప్రక్రియలో సహాయ కారిగా వీరు నిలుస్తారని, వీరు ఇచ్చే నివేదికను న్యాయస్థానం పరిగణలోనికి తీసుకుంటుందన్నారు. బాధితులకు, నేరం పాల్పడిన వారికి సైతం సైకాలజిస్ట్ల అవసరం ఉంటుందన్నారు. ప్రతీ పోలీస్ స్టేషన్లో ఫోరెన్సిక్ కిట్ ఉంటుందని, నేరం జరిగి సందర్భాలను విశ్లేషించడం, నేరగాళ్ల నుంచి నిజాన్ని రాబట్టడం తదితర ప్రక్రియలను వివరించారు. గత రెండు దశాబ్ధాలలుగా భారత్లో ఫోరెన్సిక్ సైకాలజిస్ట్ల ప్రాముఖ్యత పెరుగుతోందన్నారు. కార్యక్రమంలో సైకాలజీ విభాగాధిపతి ఆచార్య ఎం. వి. ఆర్. రాజు సదస్సు ప్రాముఖ్యత, నిపుణుల ప్రసంగాలు తదితర అశాలను వివరించారు. సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య కె. శ్రీనివాసరావు సభకు అధ్యక్షత వహించారు.