గవర్నర్‌ను కలిసి తామేమీ తప్పు చేయలేదని, అవసరమైతే మళ్లీ మళ్లీ కలుస్తామని.. అందులో తప్పేమిటని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ) రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ అన్నారు. విజయవాడలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు అన్నిరకాల ఆర్థిక చెల్లింపులకు సంబంధించిన సమస్యలపై అనేకసార్లు ప్రభుత్వ ఉన్నతాధికారులను, సీఎంను కలిసి విజ్ఞప్తి చేశామని.. వారి నుంచి స్పందన రాని పరిస్థితుల్లో గవర్నర్‌ను కలిశామన్నారు. ఉద్యోగులకు బకాయిలు, లీవ్ ఎన్‌క్యా్‌షమెంట్, ఏపీ జీఎల్‌ఐ, జీపీఎఫ్ వంటి అనేక చెల్లింపులు, డీఏ బకాయిలు రూ.11వేల కోట్ల మేర చెల్లించాల్సి ఉందన్నారు. వచ్చే ఫిబ్రవరిలో లక్షమంది పదవీవిరమణ చేసే అవకాశం ఉన్నందున వారికి రావాల్సిన బెనిఫిట్లు కూడా చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఇవన్నీ కలిపితే దాదాపు రూ.20వేల కోట్లు అవుతుందని, ఒక్క ఏడాదిలోనే ఇంత మొత్తం అంటే ఏ ప్రభుత్వమైనా భరించగలదా అని ప్రశ్నించారు. అన్ని ప్రయత్నాలూ అయ్యాకే గవర్నర్‌ను కలిశామన్నారు. ప్రభుత్వం మీద కానీ, ప్రభుత్వ విధానాలపై కానీ, ప్రభుత్వ ప్రాధాన్యతలపై కానీ విమర్శలు చేయలేదని, తప్పు పట్టలేదని స్పష్టంచేశారు. ఉద్యోగుల జీతభత్యాలు, ఆర్థిక చెల్లింపులకు సంబంధించి చట్టబద్ధత కల్పించాలన్న డిమాండ్‌ను కొనసాగిస్తామని, ఇది చట్టరూపం దాల్చే వరకు తమ ప్రయత్నం ఆగదని చెప్పారు.