వైసీపీ నేతలు తమ కుటుంబాన్ని రోడ్డున పడేశారంటూ టీడీపీ మాచర్ల నియోజకవర్గ ఇన్‌చార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి వద్ద ఓ మైనార్టీ మహిళ నూర్జహాన్ ఆవేదన వ్యక్తం చేశారు. కండీషన్ బెయిల్‌పై సంతకం చేసేందుకు మాచర్ల పట్టణానికి వచ్చిన బ్రహ్మారెడ్డి తిరుగు ప్రయాణంలో గుంటూరు వెళ్తూ పట్టణ శివారులోని సప్తగిరి కాలనీ వద్ద ఆగారు. ఆ సమయంలో కాలనీకి చెందిన నూర్జహాన్ బోరున విలపిస్తూ బ్రహ్మారెడ్డి వద్దకు వచ్చింది. ఈ దౌర్జన్య పాలనలో బతకలేమంటూ కన్నీరు పెట్టుకుంది. తమకు నెహ్రూనగర్ పెట్రోలు బంకు వద్ద ఐదు సెంట్ల స్థలముందని, దాన్ని వైసీపీ నేతలు అక్రమంగా లాక్కున్నారని బోరున విలపించింది. భర్త లేకపోవడంతో ఒంటరిగా జీవిస్తూ టిఫిన్ బండి ద్వారా బతుకు వెళ్లదీస్తున్నట్లు చెప్పింది. ఈ ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలంటూ ప్రభుత్వంపై తనకున్న అసమ్మతిని ఆవేశంగా బయటకు వెళ్లగక్కింది.