కోర్టుల్లో రికార్డులు భద్రంగా ఉంటాయని, వాటికి ఏ విధమైన ముప్పూ లేదని రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి సత్యప్రభాకరరావు చెప్పారు. మంగళవారం అమరావతి సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నెల్లూరు కోర్టులో మంత్రి కాకాని గోవర్ధన్‌రెడ్డి కేసు రికార్డులు చోరీ అయిన ఘటనపై విలేకరులు ప్రశ్నించగా.. ఒకచోట ఒక ఇన్సిడెంట్ జరిగినంత మాత్రాన కోర్టుల్లో రికార్డులు భద్రంగా లేవనడం సరికాదన్నారు. అన్ని కోర్టుల్లోనూ రికార్డుల భద్రతకు ప్రత్యేక వ్యవస్థ ఉంటుందని చెప్పారు. ప్రతి జిల్లాలో ప్రధాన జిల్లాకోర్టు పరిధిలో సెంట్రల్ రికార్డు రూమ్ ఉంటుందని, ప్రతి మున్సిబ్ కోర్టు ఏరియాలో కూడా సబార్డినేట్ రికార్డు రూములు ఉంటాయని, ప్రతి రికార్డు రూమ్‌కి రికార్డు కీపర్, గార్డులు ఉంటారని, ఏ విధమైన ఇబ్బందీ లేకుండా రికార్డు రూమ్‌ని పరిరక్షిస్తూ ఉంటారని వివరించారు. రిజిస్టర్‌లో ప్రతి రికార్డు, దస్తావేజు రికార్డు చేస్తారని, వాటికి డాక్యుమెంట్ నంబర్లు, సీరియల్ నంబర్లు వేస్తారన్నారు. రికార్డుల డిజిటలైజేషన్ అంశాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఉన్నతాధికారులపై కోర్టు ధిక్కరణ కేసులపై మాట్లాడుతూ ఇది హైకోర్టు పరిధిలో అంశమని దానిపై తానేమీ మాట్లాడలేనని చెప్పారు. జూనియర్ న్యాయవాదులను ప్రోత్సహించేందుకు 2019 నుంచి వైఎ్‌సఆర్ లా నేస్తం పథకం అమలవుతోందని తెలిపారు. లా నేస్తం కింద న్యాయవాదిగా నమోదయిన తర్వాత 3ఏళ్లపాటు నెలకు 5 వేల చొప్పున స్టైఫండ్ ఇస్తున్నామని, మూడున్నరేళ్లలో ఈ పథకం ద్వారా 65,537 మందికి రూ.34.39 కోట్ల లబ్ధి కలిగిందని తెలిపారు.