జగనన్న విదేశీ విద్య బూటకమని టీడీపీ బీసీ సెల్ నాయకులు మండిపడ్డారు. టీడీపీ బీసీ సెల్ ఆధ్వర్యంలో అనంతపురం అంబేడ్కర్ విగ్రహం ఎదుట నల్లబ్యాడ్జీలు ధరించి బుధవారం నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక నిబంధనల పేరిట బీసీ విద్యార్థులకు విదేశీ విద్యను దూరం చేశారని మండిపడ్డారు. టీడీపీ హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు వర్గాల విద్యార్థులకు విదేశీ విద్యను అందించామని గుర్తు చేశారు. సీఎం జగన నిబంధనలు అమలు చేసి విద్యార్థుల సంఖ్యను భారీగా కుదించారని విమర్శించారు. విదేశీ విద్య పథకానికి అంబేడ్కర్ పేరును తొలగించి, జగన పేరు పెట్టుకోవడం దుర్మార్గమని అన్నారు. తక్షణమే నిబంధనలను సడలించి, అర్హులందరికీ విదేశీ విద్యను వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం కలెక్టరేట్‌లో డీఆర్‌ఓ గాయత్రీదేవికి డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందించారు. కార్యక్రమంలో టీబీసీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆవుల కృష్ణయ్య, గాండ్ల సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ విశాలాక్షి, టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి దళవాయి వెంకటనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతుల లక్ష్మీనరసింహులు, నగర అధ్యక్షుడు సిమెంట్ పోలన్న తదితరులు పాల్గొన్నారు.