దేశవ్యాప్తంంగా అలజడిరేపిన ఢిల్లీ మద్యం పాలసీ వ్యవహారంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు అరెస్ట్ అయిన విషయయం తెలిసిందే. తన కుమారుడు రాఘవరెడ్డి ఎటువంటి తప్పు చేయలేదని.. ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి చెప్పారు. 70 ఏళ్లుగా తమ కుటుంబం వ్యాపారాల్లో ఉందని.. తాను 50ఏళ్లుగా వ్యాపారాలు చేస్తున్నానని.. తమ కుటుంబ వ్యాపారాలు దేశంలోని పది రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయని వివరించారు. తన తండ్రి స్థాపించిన వ్యాపారాన్ని తాము.. 70 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నామని చెప్పారు. వ్యాపారాలు చేసే క్రమంలో ఎలాంటి తప్పులు తాము చేయలేదని మాగుంట శ్రీనివాసులు రెడ్డి స్పష్టం చేశారు.
ఢిల్లీలో తాము ఏ తప్పు చేయలేదని మాగుంట స్పష్టం చేశారు. మాగుంట రాఘవరెడ్డి ని కోర్టులో కలిసినప్పుడు, పెదనాన్న సుబ్బరామిరెడ్డి పేరుకు అప్రతిష్ట పాలు చేయబోనని.. తనకు తలవంపులు వచ్చే పని కూడా చేయనని కుమారుడు చెప్పాడన్నారు. తన కుమారుడు మీద నమ్మకం ఉందని వ్యాఖ్యానించారు. రాఘవ ధైర్యంగా ఉన్నాడని.. తమను కూడా ధైర్యంగా ఉండమని చెప్పాడని స్పష్టం చేశారు. తాను రాజకీయాల్లోకి వచ్చి 32 సంవత్సరాలు అవుతోందనియ.. అప్పటినుంచి ఇప్పటిదాకా ఎలాంటి తప్పు చేయలేదని చెప్పారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఓవైపు ఛార్జ్ షీట్లలో పలువురి పేర్లను ప్రస్తావించిన ఈడీ.. మరోవైపు అరెస్ట్‌ల పర్వం కొసాగిస్తోంది. ఏపీకి చెందిన ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు మాగుంట రాఘవను ఫిబ్రవరి 11 అరెస్ట్ చేసింది. ఈ కేసులో బాలాజీ గ్రూప్ పేరు ఉండగా.. దీనికి రాఘవ యజమానిగా ఉన్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత సీఏ గోరంట్ల బుచ్చి బాబును కూడా అరెస్ట్ చేసింది ఈడీ. తాజాగా.. ఎంపీ కుమారుడిని అరెస్ట్ చేయటం సంచలనంగా మారింది.
గత ఏడాది చివర్లో ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం వెలుగు చూసిన తర్వాత.. సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీలో పలువురిని ప్రశ్నించే క్రమంలో కేసీఆర్ కుమార్తె పేరు కూడా తెరపైకి వచ్చింది. గత వారం సీబీఐ దాఖలు చేసిన అభియోగాల్లో ఎమ్మెల్సీ కవితతో పాటు ఏపీకి చెందిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేరు కూడా తెరపైకి వచ్చింది. ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో సౌత్ గ్రూప్ పేరిట చక్రం తిప్పడంలో పలువురు ప్రముఖులు కీలక పాత్ర పోషించారని.. వ్యాపార ప్రయోజనాలు పొందడానికి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఈడీ ఆరోపిస్తోంది.