పైలెట్ల అప్రమత్తతో విమానంలోని ప్రయాణికులు సేఫ్ గా బయటపడ్డారు. 162 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. సాకేంతిక సమస్య తలెత్తడంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఇందుకోసం కేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో పూర్తి స్థాయి అత్యవసర స్థితిని ప్రకటించారు. ల్యాండింగ్ చేయడానికి ముందు విమానం గాల్లో ఉండగానే అరేబియా సముద్రంలో ఇంధనాన్ని ఖాళీ చేశారు. ఎయిర్ ఎండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన ఈ విమానం శుక్రవారం ఉదయం కాలికట్ విమానాశ్రయం నుంచి 162 మంది ప్రయాణికులు, క్రూ సిబ్బందితో సౌదీ అరేబియాలోని దమామ్ కు బయల్దేరింది. విమానాన్ని తిరువనంతపురం ఎయిర్‌పోర్టులో ల్యాండ్ చేసిన దృశ్యాలను న్యూస్ ఏజెన్సీ ఏఎన్‌ఐ ట్వీట్ చేసింది.
టేకాఫ్ సమయంలోనే విమానం వెనుక భాగం రన్‌వేను ఢీకొని దెబ్బతింది. దీంతో హైడ్రాలిక్ వ్యవస్థ విఫలమైనట్లు పైలట్లు అనుమానించారు. వెంటనే అప్రమత్తమై విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాలని నిర్ణయించారు. అత్యవసర ల్యాండింగ్ కోసం తిరువనంతపురం ఎయిర్‌పోర్టును సంప్రదించారు. ఏటీసీ నుంచి సమాచారం అందుకున్న తిరువనంతపురం విమానాశ్రయ యంత్రాంగం.. ఎయిర్‌పోర్టులో ఫుల్ ఎమర్జెన్సీ ప్రకటించింది. శుక్రవారం మధ్యాహ్నం 12.15 గంటల సమయంలో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.